
- యాజమాన్యాలతో చెప్పినా పట్టించుకుంటలేరు
- కాలేజీలు, స్కూళ్ల హాస్టళ్లలో తనిఖీలు చేయండి
- పేరెంట్స్ నుంచి జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
- సెలవులు ముగియడంతో ముమ్మర తనిఖీలకు ప్లాన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని ప్రైవేట్ విద్యాసంస్థల హాస్టళ్లలో క్వాలిటీ లేని ఫుడ్ పెడుతున్నారు. లక్షల్లో ఫీజులు వసూల్ చేస్తున్నా స్టూడెంట్స్‌కు మంచి ఫుడ్ పెట్టడం లేదు. ఈ విషయంపై యాజమాన్యాలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రుల నుంచి జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై స్పందించి ముమ్మరంగా తనిఖీలు చేయాలని కోరుతున్నారు. దీంతో ఈ సమస్యను జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్తీసుకున్నట్లు తెలిసింది.
సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరవనున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ, పరిశుభ్రత నిబంధనలు పాటించని హాస్టళ్లపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫిర్యాదులతో పాటు ర్యాండమ్‌గా అన్ని ప్రాంతాల్లోని హాస్టళ్లలో తనిఖీలు చేపట్టనున్నారు. ఇటీవల ప్రభుత్వ స్కూల్స్ లోనూ మధ్యాహ్న భోజనంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరిపారు. అయితే ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఫిర్యాదులు రావడంతో రంగం దిగనున్నట్లు తెలిసింది.
జరిమానాలతో పాటు కిచెన్లు సీజ్
గతంలో నిర్వహించిన తనిఖీల్లోనూ పలు హాస్టళ్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్‌లు లేకుండా, కనీస పరిశుభ్రత పాటించకుండా, నిల్వ ఉంచిన పదార్థాలతో వంటలు తయారు చేస్తూ పట్టుబడ్డాయి. కిచెన్లలో అపరిశుభ్రమైన వాతావరణం, మురుగునీటి సమస్యలతో పాటు అనేక తప్పదాలను గుర్తించారు. మాదాపూర్ లోని ఓ కాలేజీకి లక్ష రూపాయాల జరిమానాతో పాటు కిచెన్ సీజ్ చేశారు.
అలాగే ఇదే ప్రాంతంలోని సిద్ధివినాయకనగర్ లోని మరో కాలేజ్ లోనూ ఫుడ్ లో బొద్దింకతో పాటు బల్లి వచ్చిందని ఫిర్యాదు రావడంతో తనిఖీలు నిర్వహించారు. శ్యాంపిల్ ల్యాబ్‌కు పంపారు. ఇంకా నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై జరిమానాలు విధించడంతో పాటు, తీవ్ర లోపాలున్న కిచెన్ లలను సీజ్ చేయనున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.
క్రిమినల్ కేసులు పెట్టాలి
ఫీజులు వసూల్ చేస్తున్నప్పుడు నాణ్యమైన ఫుడ్ ఎందుకు పెట్టరు. ఇటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి. జాయిన్ చేసుకునే సమయంలో మెనూ కార్డులను పేరెంట్స్ చూపుతున్నప్పటికీ.. అడ్మిషన్తరువాత స్టూడెంట్స్ కి ఆ విధంగా ఫుడ్ పెట్టడం లేదు. ప్రభుత్వ హాస్టళ్లలో పెట్టినట్లు కూడా పెట్టడంలేదు. చివరలో వచ్చిన వారికి ఒక్కోసారి ఫుడ్ కూడా దొరకడం లేదు. ఎక్కడైనా ఫుడ్ సరిగ్గా అందించకపోతే యాజమాన్యాన్ని నిలదీయండి. పండుగ తరువాత జాయిన్ అయ్యే వారికి 80 శాతం ఫీజులు చెల్లిస్తేనే స్టూడెంట్స్‌ను అలో చేస్తున్నారు. బోర్డు ప్రకారం ఫీజులు ఎక్కడ కూడా కలెక్ట్ చేయడంలేదు.
– కె అశోక్ రెడ్డి
ఎస్ఎఫ్ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్