ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఉద్యమించాలి .. ఎన్‌‌ఎస్‌‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్

ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఉద్యమించాలి .. ఎన్‌‌ఎస్‌‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్

కూకట్‌‌పల్లి, వెలుగు: విద్యార్థుల భవిష్యత్‌‌తో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు విద్యార్థులంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని ఎన్‌‌ఎస్‌‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్‌‌ఎస్‌‌యూఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం జేఎన్‌‌టీయూ క్యాంపస్‌‌లో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
 

గత పదేళ్లలో 89 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కాగా, 48 పరీక్షలను మళ్లీ నిర్వహించాల్సి వచ్చిందని, అయినా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలతో మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ సూచన మేరకు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టామని, విద్యార్థుల భవిష్యత్ కోసం ఆయన నిరంతరం పోరాడుతున్నారని చెప్పారు.

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎన్‌‌ఎస్‌‌యూఐ జాతీయ కోఆర్డినేటర్ మన్నె జీవన్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు, జేఎన్‌‌టీయూ అధ్యక్షుడు సన్నీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.