జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సర్కిల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, రెవిన్యూ విభాగాలపై తనిఖీలు కొనసాగుతుండటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. మంగళవారం జోనల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ బృందాలు, బుధవారం దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టాయి.
సిటీ రేంజ్ ఏసీబీ డీఎస్పీ గంగసారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఆఫీస్ టైమ్‌కు ముందే కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు, హాజరు కాని ఉద్యోగులపై విచారణ చేపట్టారు. సమయానికి విధులకు హాజరుకాని సిబ్బంది, నకిలీ హాజరు నమోదు, టౌన్‌ప్లానింగ్‌లో నోటీసుల తర్వాత చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలపై పరిశీలన జరుపుతున్నారు.
ఈ తనిఖీలు ఆరు నెలల పాటు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అవినీతిపై ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వరకూ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
