టెట్​ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్ట్ :ఆర్ కృష్ణయ్య

టెట్​ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్ట్ :ఆర్ కృష్ణయ్య
  •     ప్రభుత్వం స్పందించకుంటే11న ‘చలో హైదరాబాద్’
  •     రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

ముషీరాబాద్, వెలుగు :  టెట్​నిర్వహించకుండా డీఎస్సీ నోటిఫికేషన్​వేయడం వృథా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చెప్పారు. గతంలో నిర్వహించిన టెట్​లో10 శాతం మంది కూడా పాస్ కాలేదన్నారు. మొదట టెట్ నోటిఫికేషన్ ఇచ్చి, తర్వాత డీఎస్సీ ద్వారా టీచర్​పోస్టులు భర్తీ చేసే సంప్రదాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రెండు రోజుల్లో టెట్​నోటిఫికేషన్ వేయకపోతే, రాష్ట్రంలోని స్టూడెంట్లు, నిరుద్యోగులతో కలిసి ఈనెల 11న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. 

శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్ లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన నిరుద్యోగుల సమావేశం జరిగింది. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ.. గతంలో డీఎస్సీతోపాటు టెట్​నిర్వహించారని, ఇప్పుడు కాంగ్రెస్​ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటో చెప్పాలన్నారు. టెట్ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్​వద్దని, ఒకవేళ ప్రభుత్వం వేరే ఆలోచన చేస్తే ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రూప్ 1, 2, 3లో తక్కువ పోస్టులు చూపిస్తున్నారని, వాటిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నీల వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెరగాలంటే డీఎస్సీతోపాటు టెట్​నిర్వహించాలని కోరారు. సమావేశంలో పగడాల సుధాకర్, నందగోపాల్, రాజేందర్, రాజ్ కుమార్, ఉదయ్, వంశీకృష్ణ, జయంతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.