రూపాయి క్షీణత.. ఆర్థిక భవిష్యత్తుకు ముప్పు

రూపాయి క్షీణత.. ఆర్థిక భవిష్యత్తుకు ముప్పు

రూపాయి విలువ  మరింత క్షీణించడం భారత  ఆర్థిక వ్యవస్థకు మరో పెద్ద సవాల్.  మంగళవారం నాడు ఒక డాలర్  రూ.91.03 దాటింది. ఇది ఆందోళనకరం.  గతేడాది ఇదే సమయంలో రూ.85 ఉన్న రూపాయి ఐదుశాతం బలహీనపడింది. ఇది కేవలం మారక రేటు సంఖ్య కాదు.  నిత్యజీవితంలో ప్రతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడి.  ఇంధన ధరలు పెరగడం, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఖర్చులు భారీగా పెరగడం, దిగుమతి వస్తువుల ధరలు  పెరుగుదలను ఇది సూచిస్తోంది.  అమెరికా సుంకాల పెంపు, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం రూపాయికి బలమైన దెబ్బ తీశాయి. విదేశీ పెట్టుబడిదారులు రూ.1.48 లక్షల కోట్ల షేర్లు  అమ్మి బయటకు వెళ్లడంతో మార్కెట్ కూడా కుదేలైంది. ఇంకా భారత్ 80% చమురు దిగుమతులపై ఆధారపడటం వాణిజ్య లోటును ఎగదొస్తోంది. అమెరికా వడ్డీ రేట్లు ఎత్తులో ఉండడంతో  డాలర్ బలపడింది.  రూపాయి పతనం వేగం ఎక్కువగా ఉంది. బంగారం దిగుమతులు భారీగా పెరగడం, స్టాక్ మార్కెట్ నుంచి నిధులు బయటకు పోవడం  పరిస్థితిని మరింత దిగజార్చాయి.

ద్రవ్యోల్బణం ప్రమాదం

 నెలకు 1,500 డాలర్లు విదేశీ విద్య కోసం పంపే తల్లిదండ్రులు గత ఏడాది రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తే.. ఇప్పుడు రూ.1.35 లక్షలు ఖర్చవుతోంది.  ద్రవ్యోల్బణం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. మధ్యతరగతి జీవితం మరింత కఠినమవుతోంది. ఈ సంక్షోభాన్ని తాత్కాలిక చర్యలతో ఆపలేం.  ఆర్బీఐ ఇప్పటికే $30 బిలియన్ అమ్మి రూపాయిని నిలబెడుతోంది.  కానీ ఇది తాత్కాలికం.  వాస్తవ పరిష్కారం.. ఎగుమతులు పెరగడం, దిగుమతులు తగ్గడం. ‘మేక్ ఇన్ ఇండియా’ను  మరింత  బలోపేతం చేయాలి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరగా పూర్తి చేస్తే మళ్లీ మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. బంగారం వంటి దిగుమతులపై  నియంత్రణ అవసరం. ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. బడ్జెట్ లోటును అదుపులో పెట్టి పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవాలి.  ఇవన్నీ సమన్వయంతో జరిగితే రూపాయి మళ్లీ  పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.  రూపాయి క్షీణత ఒక విధంగా దేశానికి గట్టిగా వినిపిస్తున్న హెచ్చరిక.    స్పష్టమైన చర్యలతోనే రూపాయిని 
నిలబెట్టి దేశ భవిష్యత్తును రక్షించాలి.

 శ్రీనివాస్ గౌడ్ ముద్దం