- లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ
ముషీరాబాద్, వెలుగు: కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు పెంచే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీ ఉద్యమాన్ని ఆషామాషీగా చూడొద్దని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టామని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకకు పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
శుక్రవారం 42 శాతం బీసీ రిజర్వేషన్ల డిమాండ్ తో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ఆర్. కృష్ణయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని కోరారు. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో బీసీలు 61 శాతం గెలిచారని చెప్పారు.
కానీ పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు రావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు ర్యాలీలకు పిలుపునిచ్చామని తెలిపారు. అయినా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నదని..దీని ఎట్టి పరిస్థితిలో సహించమని హెచ్చరించారు.
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ మాట్లాడుతూ..పాలకులు ఇంకా బీసీల ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుజ్జ సత్యం, నీల వెంకటేశ్, పగిళ్ల సతీశ్, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.
