రౌడీషీటర్ మర్డర్ కేసులో 8 మంది అరెస్ట్

రౌడీషీటర్ మర్డర్ కేసులో 8 మంది అరెస్ట్

ఎల్​బీనగర్,వెలుగు: బాలాపూర్ లో జరిగిన రౌడీ షీటర్ హత్య కేసును రాచకొండ -పోలీసులు ఛేదించారు. 13 మంది నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద కంట్రీ మేడ్ గన్, రెండు బుల్లెట్లు, రెండు గొడ్డళ్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.  రాచకొండ సీపీ సుధీర్ బాబు బుధవారం వివరాలు వెల్లడించారు. బాలాపూర్ ఫరీఫ్ నగర్ కు చెందిన  రౌడీ షీటర్ ఖాజా రియజుద్దీన్(40) రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు.  

మీర్ పేట్ లోని ఓ వాటర్ ప్లాంట్ కు చెందిన ప్లాట్ విషయంలో కొద్ది రోజుల కిందట ఖాజా రియజుద్దీన్ కు షేక్ మహ్మద్ హమీద్ (56) కు  మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో హామీద్ ను చంపుతానని రౌడీ షీటర్ ఖాజా రియజుద్దీన్ హెచ్చరించాడు. అతడినే చంపేందుకు  డిసైడైన హామీద్ ఓల్డ్ సిటీ పరిధి మల్లాపూర్ కు చెందిన పాత నేరస్తుడు మహ్మద్ సలీం(32)కు రూ. 13 లక్షలు సుపారీ మాట్లాడుకుని  అడ్వాన్స్ గా రూ.2.50 లక్షలు ఇచ్చాడు. హమీద్ మర్డర్ కు ప్లాన్ చేసి.. అంతకుముందే దుబాయ్ కి వెళ్లిపోయాడు. సలీం యూపీకి వెళ్లి కంట్రీ మేడ్ తుపాకీ తీసుకుని,  ఆ తర్వాత సిటీకి వచ్చి మొయినాబాద్ లో గొడ్డళ్లు, కత్తి కొనుగోలు చేశారు. తన గ్యాంగ్ లోని మహ్మద్ సుల్తాన్, మహ్మద్ గౌస్, మహ్మద్ ఇస్మాయిల్, అహ్మద్, సయ్యద్ ఇనాయత్, తహాఫిక్ ఖాన్,షేక్ హుసేన్, ఫజిల్ లతో ప్లాన్ చేశాడు.

  ఖాజా రియజుద్దీన్ పై రెక్కీ వేశారు. ఈనెల 8న రాత్రి కంచన్ బాగ్ లోని ఓ వైన్స్ లో ఖాజా రియజుద్దీన్ మద్యం తాగి బైక్ పై వెళ్తుండగా నిందితులు కారుతో ఢీకొట్టారు. అతను కింద పడగానే కళ్లలో కారం చల్లి గొడ్డళ్లు, కత్తితో అతడిని పొడిచారు. ఆ తర్వాత చాతిపై సలీం తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో  ఖాజారియజుద్దీన్ స్పాట్ లోనే చనిపోయాడు.  అనంతరం కారులో నిందితులు విజయవాడకు వెళ్లారు. 

అక్కడ కారు వదిలేసి భువనేశ్వర్ కు వెళ్లారు. మృతుడి కుటుంబసభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసి.. 8 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మహ్మద్ హమీద్, ఫజిల్,ఫరీజ్ పరారీలో ఉన్నారు. ఖాజా రియజుద్దీన్ ను చంపితే తానే డాన్ అవుతానని సలీం ఘటన తర్వాత చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.