తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్!

తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్!
  •     బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపణ
  •     సమగ్ర విచారణ జరపాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 'పీఎం సూర్య ఘర్' పథకం అమలులో రూ. 200 కోట్ల భారీ స్కాం జరిగిందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ‘హర్ ఘర్ బిజిలీ ముక్త్ యోజన’ అమలులో కేంద్ర ఇస్తోన్న నిధులు పక్కదారి పట్టాయన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ భారీ స్కాంతో పాటు ఇతర అక్రమాలపై కేంద్ర నూత‌‌న, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కంప్లైంట్ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 40 వేల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే పేరుతో ఒక్కో ఇంటికి రూ. 50 వేల చొప్పున మొత్తం రూ. 200 కోట్లు పక్కదారి పట్టించారని తెలిపారు. 

ఒక్కో ఇంటికి రూ. 1.36 లక్షల చొప్పున  మొత్తం 40 వేల ఇండ్లపై  సోలార్ సిస్టమ్స్ ఏర్పాటుకు టెండర్ దక్కించుకున్న సంస్థ.. మరొక కంపెనీకి ఒక్కో ఇంటికి రూ. 86 వేలకే పనులు సబ్‌‌కాంట్రాక్ట్ ఇచ్చిందన్నారు. ఈ వ్యత్యాసమైన రూ. 50 వేలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ నిధులతో ఉచిత విద్యుత్ ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఈ విషయంలో "డబ్బు కేంద్రానిది.. సోకు కాంగ్రెస్‌‌ది" అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

కొత్త పోస్టల్ రీజియన్ ఏర్పాటు చేయాలి

తెలంగాణలో పోస్టల్ సర్వీసులను మరింత సమర్థవంతంగా అందించేందుకు వరంగల్ కేంద్రంగా కొత్త పోస్టల్ రీజియన్‌‌తో పాటు కొత్తగా మూడు పోస్టల్ డివిజన్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రఘునందర్ రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సహచర ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం న‌‌గేశ్‌‌ల, ఈటలతో కలసి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌‌ను రఘునందర్ రావు కలిశారు.