రేషన్ కార్డులపై మోదీ బొమ్మ పెట్టాలి : ఎంపీ రఘునందన్ రావు

రేషన్ కార్డులపై మోదీ బొమ్మ పెట్టాలి : ఎంపీ రఘునందన్ రావు
  •     లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదు: ఎంపీ రఘునందన్ రావు 
  •     రేషన్ బియ్యంలో కేంద్రం ఐదు కిలోలు ఇస్తుంటే.. రాష్ట్రం ఇచ్చేది కిలో బియ్యమే 
  •     కార్డులపై సీఎం, మంత్రుల ఫోటోలు మాత్రమే పెట్టడం సరికాదని ఫైర్ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కొత్తగా పంపిణీ చేయనున్న స్మార్ట్‌‌‌‌‌‌‌‌ రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులతో పాటు రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటోను పెట్టాలని, లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని బీజేపీ ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌ రావు హెచ్చరించారు. మోదీ ఫొటోను ముద్రించకుండా పంపిణీ చేపడితే అడ్డుకుంటామని.. ఆ తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న ఆరు కిలోల రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యంలో కేంద్రం ఐదు కిలోలు ఉచితంగా ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో మాత్రమే ఇస్తోందన్నారు. ప్రధాన వాటా కేంద్రానిదే అయినప్పుడు ప్రధాని ఫోటోను పక్కనపెట్టి.. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటోలను మూడు చోట్ల కార్డులపై ముద్రించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 

రాష్ట్రంలో 90 లక్షల పాత కార్డులు ఉండగా, కొత్తగా ఇవ్వాల్సిన16 లక్షల కార్డులతో కలిపి ఏకంగా1.06 కోట్ల స్మార్ట్‌‌‌‌‌‌‌‌ రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తోందని ఆయన ప్రశ్నించారు. రేషన్ పంపిణీకి సంబంధించి క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం రూ.110 కమీషన్‌‌‌‌‌‌‌‌ డీలర్లకు చెల్లిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.40 మాత్రమే ఇస్తోందన్నారు. తక్షణమే సీఎం, మంత్రుల ఫోటోలతో ఉన్న కార్డులను రద్దు చేసి, ప్రధాని మోదీ ఫోటోతో కొత్త కార్డులు ముద్రించిన తర్వాతే పంపిణీ చేపట్టాలన్నారు. కర్నాటకలోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కందిపప్పు, వంట నూనె, రాగులు, చక్కెర, గోధుమలు తదితర ఐదు రకాల వస్తువులను పంపిణీ చేస్తోందన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.