- కాంగ్రెస్‌కు ఎంతకు అమ్ముడు పోయారు
- జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిపై ఫైర్
హైదరాబాద్, వెలుగు : బీజేపీకి సిద్ధాంతం లేదంటూ కొందరు పార్టీ మారినవాళ్లు విమర్శిస్తున్నారని, ఆయన కొడుక్కి సీటిస్తే సిద్ధాంతం ఉన్నట్టు.. ఇవ్వకపోతే లేనట్టా? అని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. ‘‘పార్టీలోకి చేరగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో కూర్చోబెట్టాం. అప్పుడు బీజేపీ సిద్ధాంతం మంచిది.. ఇప్పుడు మంచిది కాదా?”అని జితేందర్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలప్పుడు సెకండ్ లిస్ట్‌లోనే జితేందర్ రెడ్డి కొడుకు ఒక్కడి పేరే వచ్చింది. అప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంది.. ఇప్పుడు లేదా? అవసరాలకు అనుగుణంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు. వెంటనే బీజేపీకి క్షమాపణలు చెప్పాలి’’అని డిమాండ్ చేశారు.
సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ‘‘ఏ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పార్టీ మారారో ప్రజలకు చెప్పాలి. బీజేపీ సిద్ధాంతం గురించి తప్పుగా మాట్లాడారు. అందుకే నేను వ్యక్తిగత దూషణలకు దిగడం లేదు. చేవెళ్ల ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేవీల గురించి మాకు తెలుసు. మీరిద్దరు కాంగ్రెస్ లో చేరి మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ ఎంపీ స్థానాల్లో ఎంత ఖర్చు పెడ్తారో మాకు తెలుసు’’అని అన్నారు.
అవినీతి బాగోతం అంతా తెలుసు
“ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కన్ స్ట్రక్షన్.. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలేవి? సర్వే నంబర్ 341లో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత? ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి.. ఎన్ని ఇచ్చారు? కడితే ఎంత ఖర్చు అవుతుంది? అమ్మితే ఎంత వస్తుంది? అసలు ఏ రకంగా మీరిద్దరూ కలిసి ఎన్నికలను కమర్షియల్ చేయాలనుకున్నరు? ఇదంతా ప్రజలకు చెప్పాలి’’అని రఘునందన్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జెండాపై గెలిచిన ఎంపీలందరిలో ఎక్కువ లబ్ధి పొందింది రంజిత్ రెడ్డే అని చెప్పారు.
‘‘రేవంత్ గతంలో బీఆర్ఎస్పై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీఎంగా ఉండి కూడా అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం లేదు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనం ఏంటి? కంపెనీలకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? ఎన్నికలకు పంపించే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. కంపెనీ వివరాలన్నీ త్వరలో ప్రజల ముందు ఉంచుతాం’’అని అన్నారు. షేక్‌పేటలోని సర్వే నంబర్ 403లో జరుగుతున్న అక్రమ కట్టడాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 342, 403లో జరుగుతున్న కన్స్ట్రక్షన్ భూ బాగోతాలపై ఈడీ, ఐటీ శాఖకు కంప్లైంట్ చేస్తాం’’అని హెచ్చరించారు.
