లడఖ్ ప్రజలకు మోదీ ద్రోహం..ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్

లడఖ్ ప్రజలకు మోదీ ద్రోహం..ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్
  • కాల్పుల్లో కార్గిల్ వీర జవాను మరణంపై ఆవేదన 
  • ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ 

న్యూఢిల్లీ: హక్కుల కోసం పోరాడుతున్న లడఖ్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ద్రోహం చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. గత బుధవారం పోలీసు కాల్పుల్లో నలుగురు మృతిచెందిన ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. లడఖ్​లో నిరసనల సందర్భంగా కాల్పుల్లో మృతిచెందిన వారిలో కార్గిల్ వీర జవాను సెవాంగ్ థార్చిన్ కూడా ఉన్నారని, దేశం కోసం పోరాడినందుకు ఆయనకు మోదీ సర్కారు బుల్లెట్ ను బహుమతిగా ఇచ్చిందని మండిపడ్డారు. 

సెవాంగ్ థార్చిన్ కాల్పుల్లో మృతిచెందడంపై ఆయన తండ్రి రిటైర్డ్ సుబేదార్ మేజర్ స్టాంజిన్ నంగ్యాల్ కన్నీటిపర్యంతం అవుతూ మాట్లాడిన వీడియో క్లిప్​ను ఖర్గే, రాహుల్ మంగళవారం తమ ‘ఎక్స్’ ఖాతాల్లో పోస్ట్ చేశారు.లడఖ్ దుఃఖం యావత్తు దేశానికి దుఃఖమని ఖర్గే అన్నారు. ‘‘షహీద్ సెవాంగ్ థార్చిన్ కార్గిల్ యుద్ధంలో మదర్ ఇండియా కోసం పోరాడారు. బదులుగా ఆయన ఏం పొందారు? మోదీ సర్కారు నుంచి లడఖ్​లో ఓ బుల్లెట్​ను పొందారు” అని పేర్కొన్నారు.

హింసా రాజకీయాలు మాని, చర్చించండి..  

సౌత్ అమెరికాలోని నాలుగు దేశాల పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కూడా సెవాంగ్ థార్చిన్ విషయంలో కేంద్రం తీరుపై మండిపడ్డారు. ‘‘తండ్రి ఆర్మీలో పని చేశారు. కొడుకు కూడా ఆర్మీలో సేవలు అందించారు. దేశభక్తి వారి రక్తంలోనే ప్రవహిస్తోంది. అయినా, లడఖ్ కోసం, తన హక్కుల కోసం నిలబడినందుకుదేశ ముద్దుబిడ్డను బీజేపీ సర్కారు కాల్చిచంపింది. 

కన్నీటితో నిండిన ఆ తండ్రి కండ్లు ఒకే ప్రశ్న వేస్తున్నాయి. దేశానికి సేవ చేసినందుకు బహుమతి ఇదేనా? అని ప్రశ్నిస్తున్నాయి” అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మోదీజీ.. మీరు లడఖ్ ప్రజలకు ద్రోహం చేశారు. వారు తమ హక్కులను అడుగుతున్నారు. హింసాత్మక, భయాందోళనలకు గురిచేసే రాజకీయాలు మాని, వారితో చర్చించండి” అని రాహుల్ కోరారు.