మనుగడ పోరులో.. నల్లమల పులి !    సంఖ్యకు అనుగుణంగా పెరగని ఆహార వనరులు

మనుగడ పోరులో.. నల్లమల పులి !    సంఖ్యకు అనుగుణంగా పెరగని ఆహార వనరులు
  • కొత్త ఆవాసాల కోసం అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌ వైపు పయనం
  • రోడ్ల విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులతో ప్రయాణానికి అడ్డంకులు
  • అటవీ సరిహద్దు ప్రాంతాల్లో కుక్కల ద్వారా ‘కెనైన్ డిస్టెంపర్’ వైరస్ ముప్పు

హైదరాబాద్, వెలుగు : దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రమైన ‘నాగార్జునసాగర్ -శ్రీశైలం టైగర్ రిజర్వ్’ (ఎన్​ఎస్​టీఆర్)లో పులుల మనుగడ కష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. కానీ ఆ మేరకు ఆహార వనరులు లేకపోగా, అటవీ మార్గాలు సైతం మూసుకుపోతుండడంతో పులులు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాయి. పులుల భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకుంటుండడంతో వన్యప్రాణి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులుల ఆయుష్షు పెరగాలంటే అడవుల సంరక్షణ ఒక్కటే మార్గమని వారు చెబుతున్నారు.

ఆవాసాల కోసం అన్వేషణ

నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ సుమారు 5,443 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో గతంలో 47 పులులు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 76 దాటింది. పులుల సంఖ్య భారీగానే పెరిగినా అందుకనుగుణంగా అటవీ విస్తీర్ణం పెరగడం లేదు. దీంతో పులులు కొత్త ఆవాసాల కోసం సమీపంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వైపు వస్తున్నాయి. 

ఇప్పటికే ఏపీలోని ఆత్మకూరు నుంచి మూడు మగ పులులు, మార్కాపూర్ నుంచి ఒక ఆడ పులి కృష్ణా నది పరివాహక ప్రాంతం మీదుగా అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాయి. పులుల ప్రయాణంలో కారిడార్ల సమస్య ఎదురవుతోంది. రోడ్ల విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు పులుల వలస మార్గాలకు ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. దీనివల్ల పులుల మధ్య జన్యు వైవిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు.

కుక్కల ద్వారా పొంచి ఉన్న వైరస్

అడవిలో పులుల సంఖ్య పెరుగుతున్నా.. వాటికి ఆహారమైన జింకలు, సాంబార్లు, అడవి పందుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. మేత కోసం పశువులు అటవీ ప్రాంతాల్లోకి వస్తుండడంతో అక్కడ గడ్డి మైదానాలు తగ్గిపోతున్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఫలితంగా శాకాహార జంతువుల సంతతి కూడా తగ్గుతుండడంతో పులులు తమ ఆకలి తీర్చుకునేందుకు అటవీ సరిహద్దు గ్రామాల్లోకి చొరబడి పశువులపై దాడులు చేస్తున్నాయి. 

ఇది మానవ, -వన్యప్రాణి సంఘర్షణకు కూడా దారి తీస్తోంది. మరో వైపు కుక్కల ద్వారా సంక్రమించే ‘కెనైన్ డిస్టెంపర్’ వైరస్ తో పులులకు ప్రమాదం ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అటవీ సరిహద్దు గ్రామాల్లోని కుక్కల ద్వారా ఈ వైరస్ పులులకు సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో దేశంలోని ఇతర రిజర్వ్ ఫారెస్ట్ ల్లో ఈ వైరస్ కారణంగా పులులు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు నల్లమలలో ఈ ముప్పు పొంచి ఉండడం పులులకు సవాల్‌‌‌‌‌‌‌‌గా మారింది.

అటవీ మార్గాల్లో వెళ్లే హైవేలపై ఎకో-బ్రిడ్జిలు...

పులుల సంఖ్య విషయంలో పారదర్శకంగా ఉండాలని వన్యప్రాణి నిపుణులు కోరుతున్నారు. మొత్తం పులుల్లో ఆడ పులులు ఎన్ని  ? సంతానోత్పత్తి సామర్థ్యం ఉన్నవి ఎన్ని ? వంటి వివరాలను స్పష్టం చేస్తేనే సంరక్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. గణాంకాలపైనే కాకుండా.. పర్యావరణ స్థిరత్వంపై దృష్టి సారించినప్పుడే నల్లమల పులుల మనుగడ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు అత్యాధునిక కెమెరా ట్రాప్‌‌‌‌‌‌‌‌లు, డ్రోన్ల ద్వారా పులుల కదలికలను నిరంతరం గమనించాలని కోరుతున్నారు. 

పులుల వలస మార్గాల్లో అడ్డంకులు తొలగించేలా అటవీ మార్గాల్లో వెళ్లే హైవేలపై ‘ఎకో-బ్రిడ్జిల’ను నిర్మించాలని, రాత్రిపూట వాహనాల రాకపోకలను కఠినతరం చేయాలని సూచిస్తున్నారు. అటవీ సరిహద్దుల్లోని 110 గ్రామాల్లో ఉన్న కుక్కలకు కెనైన్ డిస్టెంపర్ టీకాలు వేయడంతో పాటు వాటికి సంతానోత్పత్తి నియంత్రణ ఆపరేషన్లు చేయాలని కోరుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జింకలు, సాంబార్లను తెచ్చి నల్లమల అడవిలో విడిచిపెట్టాలని చెప్తున్నారు. అడవిపై ఆధారపడే చెంచులకు, గిరిజనులకు ఇతర ఉపాధి మార్గాలు చూపి అడవిపై ఒత్తిడి తగ్గించాలని, అప్పడే టైగర్ల మనుగడ సాధ్యమని పేర్కొంటున్నారు.