న్యూఢిల్లీ: బెంగాల్‌లో ప్రజాస్వామ్యంలేదని, కేవలం టీఎంసీ హత్యా రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఆసన్ సోల్ లో కాంగ్రెస్ కార్యకర్త దేబ్ దీప్ ఛటర్జీ హత్యను ఆదివారం ఆయన ఎక్స్‌వేదికగా ఖండించారు. తమ పార్టీ అభ్యర్థి ప్రసేన్‌జిత్ పుయితాండికి అత్యంత సన్నిహితుడైన దేబ్ దీప్ ఛటర్జీపై టీఎంసీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు.
తీవ్రంగా గాయపడిన ఛటర్జీ.. కొద్దిసేపటికే మృతి చెందారని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రతిపక్షాల కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణం జరిగినా కనీసం ఎఫ్‌ఐఆర్‌కూడా నమోదు చేయకపోవడం అక్కడి పాలనా తీరుకు నిదర్శనమన్నారు. భారత్ అహింసా సంప్రదాయానికి మచ్చ తెచ్చే ఇటువంటి రాజకీయాలకు కాంగ్రెస్ ఎన్నటికీ తలవంచదన్నారు.
హత్య కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి భద్రత కల్పించి, పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ప్రజాస్వామ్యాన్ని తుపాకీ గుళ్లతో, హింసతో అణచివేయలేరని, దేశంలోని ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.

