రాహుల్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించట్లే ..కాంగ్రెస్ చీఫ్ కు సీఆర్పీఎఫ్ లేఖ

రాహుల్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించట్లే ..కాంగ్రెస్ చీఫ్ కు సీఆర్పీఎఫ్ లేఖ

న్యూఢిల్లీ: కాంగ్రెస్  ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్  గాంధీ తన సెక్యూరిటీ ప్రొటోకాల్ పాటించడం లేదని  సీఆర్పీఎఫ్ ఆరోపించింది. అంతేకాకుండా ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్తున్నారని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున  ఖర్గేకు సీఆర్పీఎఫ్  వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్​ సునీల్  జూనే లేఖ రాశారు. తన సెక్యూరిటీ కవర్ ను రాహుల్  సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. 

విదేశాల్లో ఉన్నప్పుడూ రాహుల్  సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించారని చెప్పారు. నిరుడు డిసెంబరు 30 నుంచి జనవరి 9 వరకు ఇటలీలో, ఈ ఏడాది మార్చి 12 నుంచి 17 వరకు వియత్నాంలో, ఏప్రిల్ 17 నుంచి 23 వరకు దుబాయ్ లో, జూన్ 11 నుంచి 18 వరకు ఖతార్ లో, జూన్  25 నుంచి జులై 6 వరకు లండన్ లో, ఈనెల 4 నుంచి 8 వరకు మలేషియాలో రాహుల్  పర్యటించారని ఆయన వివరించారు. సీఆర్పీఎఫ్  యెల్లో బుక్  లో ప్రస్తావించిన ప్రొటోకాల్స్ ను ఆ సమయంలో రాహుల్  ఉల్లంఘించారని జూనే తెలిపారు.