దేశంలో ట్యాక్స్ టెర్రరిజం .. వ్యవస్థలన్నీ ఆగమైతున్నయ్ : రాహుల్ గాంధీ

దేశంలో  ట్యాక్స్ టెర్రరిజం .. వ్యవస్థలన్నీ ఆగమైతున్నయ్ : రాహుల్ గాంధీ
  • లోక్​సభలో రాహుల్ గాంధీ ఫైర్
  • మిడిల్ క్లాస్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
  • అదానీ, అంబానీకి సంపద దోచిపెడ్తున్నరు
  • ఆరుగురి పద్మవ్యూహంలో దేశం చిక్కుకున్నది
  • ఇప్పుడు పద్మవ్యూహంలో ఉన్నది అభిమన్యులు కాదు.. అర్జునులు
  • ఇక నుంచి నేను మాట్లాడుతుంటే మోదీ సభకే రారని కామెంట్

న్యూఢిల్లీ: బడ్జెట్​లో మధ్యతరగతి ప్రజలకు కేంద్రం వెన్నుపోటు పొడిచిందని లోక్​సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ట్యాక్స్ టెర్రరిజంతో వ్యవస్థలు ఆగమవుతున్నాయని మండిపడ్డారు. పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నదని విమర్శించారు. దేశం మొత్తం ఆరుగురి బీజేపీ మోడ్రన్ ‘పద్మవ్యూహం’లో చిక్కుకున్నదని అన్నారు. అందులో రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, యువకులు, సమాజంలోని ఇతర వర్గాల వాళ్లంతా చిక్కుకున్నారని తెలిపారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్లు చేశారు. వేల ఏండ్ల కింద హర్యానాలోని కురుక్షేత్రంలో అభిమన్యుడిని పద్మవ్యూహంలో బంధించి ఎలా అయితే చంపేశారో.. అలాంటి పరిస్థితే దేశంలో ఉందన్నారు. మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఆరుగురు నియంత్రిస్తే.. ఇప్పుడు దేశాన్ని మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ లాంటి వారు కంట్రోల్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 

వ్యాపారవేత్తల పేర్లను రాహుల్ ప్రస్తావించడంపై స్పీకర్‌‌  ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదనలతో సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌‌  రిజిజు జోక్యం చేసుకున్నారు. రాహుల్‌‌ కు సభానియమాలు తెలియవంటూ విమర్శించారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. అధికార పక్ష నేతల వ్యవహారశైలికి అనుగుణంగా తాము స్పందిస్తామని తేల్చి చెప్పారు.

పద్మం అంటేనే బీజేపీ సింబల్

‘‘ప్రధాని మోదీ తన ఛాతీపై ధరించే కమలాన్ని పద్మం అంటరు. ఆ పద్మం.. చక్రవ్యూహాన్ని పోలి ఉంటది. చక్రవ్యూహాన్ని.. పద్మవ్యూహం అని కూడా అంటరు. వేల ఏండ్ల కింద కురుక్షేత్రంలో అభిమన్యున్ని ఆరుగురు వ్యక్తులు ‘పద్మవ్యూహం’లో బంధించి చంపారు. బీజేపీ సింబల్ కూడా అదే.. ఇప్పుడు 21వ శతాబ్దంలో మరో కొత్త పద్మవ్యూహం ఏర్పడింది. అదే బీజేపీ మోడ్రన్ ‘పద్మవ్యూహం’. 

ఇందులో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చిక్కుకుపోయారు. అప్పుడు ఆరుగురు వ్యక్తులు.. అభిమన్యుడితో ఎలా వ్యవహరించారో.. ఇప్పుడు దేశ ప్రజలతో మోదీ, అమిత్ షా, అదాని, అంబానీ, మోహన్ భగవత్, అజిత్ దోవల్ అలాగే వ్యవహరిస్తున్నరు’’అని అన్నారు. యువకులు అగ్నివీర్ అనే పద్మవ్యూహంలో చిక్కుకున్నారని, అగ్నివీర్లకు పెన్షన్ కోసం బడ్జెట్‌‌ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు.

మోడ్రన్ పద్మవ్యూహం వెనుక మూడు శక్తులున్నయ్

ఆరుగురి పేర్లను సభలో రాహుల్ ప్రస్తావించడంతో స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. దీంతో రాహుల్ స్పందిస్తూ.. ‘‘దోవల్, అంబానీ, అదానీ పేర్లను వదిలేసి ముగ్గురి పేర్లను ప్రస్తావిస్తాను. బీజేపీ మోడ్రన్ పద్మవ్యూహం వెనుక మూడు శక్తులున్నయ్. అందులో మొదటిది గుత్తాధిపత్య పెట్టుబడి. దేశ సంపద మొత్తం ఏ1, ఏ2 (అదానీ, అంబానీ) వద్దే ఉండాలనేది ఈ శక్తి ఉద్దేశం. 

ఇక రెండోది.. కేంద్ర దర్యాప్తు సంస్థలు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు దిగుతున్నది. ఇక మూడోది.. రాజకీయ కార్యనిర్వాహక వర్గం. ఈ ముగ్గురూ కలిసి పద్మవ్యూహం నడిబొడ్డున నిలబడి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నరు. బీజేపీ నిర్మించిన మోడ్రన్ పద్మవ్యూహాన్ని కోట్లాది ప్రజలకు హాని కలిగిస్తున్నది. ఈ పద్మవ్యూహాన్ని కుల గణన ద్వారా ఛేదించబోతున్నం’’అని రాహుల్ అన్నారు.

బడ్జెట్ హల్వా మీరే తింటరా?

దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలు దేశంలో 73శాతం ఉన్నారని రాహుల్ అన్నారు. వారికి ఏ రంగంలో కూడా అవకాశం దొరకడం లేదని తెలిపారు. బిజినెస్, పాలిటిక్స్, కార్పొరేట్ సెక్టార్​లో ఎక్కడా వారికి సరైన స్థానం కల్పించడం లేదని అన్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్​కు ముందు ఆర్థిక శాఖ అధికారులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా తింటున్న ఫొటోను రాహుల్ సభలో ప్రదర్శించారు. ప్లకార్డును టీవీలో చూపించకుండా అడ్డుకోవడంపై రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఈ ఫొటోలో 20 మంది అధికారులు కనిపిస్తున్నరు. 

వీరిలో ఒక్క ఆదివాసి, దళితుడు, వెనుకబడిన వర్గానికి చెందిన ఆఫీసర్ కనిపించడం లేదు. కేవలం ఇద్దరు మాత్రమే దేశంలోని 95శాతం ప్రజానీకానికి చెందిన వారున్నరు. ఒకరు మైనారిటీ, మరొకరు ఓబీసీ అతను ఉన్నడు. వీరు హల్వా వేడుకలో చివర్లో ఉన్నరు. దేశంలో ఏం జరుగుతున్నది? దేశం మొత్తానికి హల్వా ఇవ్వరా? మీరే తింటారా? 73శాతం ప్రజలకు హల్వా దొరకడమే లేదు’’అని రాహుల్ అన్నారు. దీంతో నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా తలపట్టుకుని నవ్వుకున్నారు.

ఇంటర్న్​షిప్​తో ఒరిగేదేమీ లేదు

కేంద్రంలోని ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే ఉందంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘ఒక్క నిరుద్యోగికి కూడా జాబ్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఒకవైపు పేపర్ లీక్, మరోవైపు నిరుద్యోగ పద్మవ్యూహంలో దేశం ఉంది. ఇంటర్న్‌‌ షిప్ వల్ల యువతకు ఒరిగేదేమీ లేదు. టాప్ 500 కంపెనీల్లో దీన్ని అమలు చేస్తామన్నరు. దేశంలోని 99శాతం యువతకు ఇంటర్న్​షిప్​తో ఎలాంటి ఉపయోగం లేదు. కాళ్లు విరగ్గొట్టి.. మీద బ్లాంకెట్ వేసినట్లు ఉంది మీ వ్యవహారం. అగ్నివీర్‌‌ ల పెన్షన్‌‌ కు బడ్జెట్‌‌ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మధ్యతరగతి ప్రజలను పూర్తిగా విస్మరించారు. కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు చాలాకాలం నుంచి అడుగుతున్నా.. బడ్జెట్‌‌ లో ప్రస్తావనే లేదు’’అని రాహుల్ నిప్పులు చెరిగారు.

మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలి

పార్లమెంట్ పరిసరాల్లో విధిస్తున్న ఆంక్షలపై రాహుల్ మండిపడ్డారు. మీడియాకు అనుమతించడం లేదన్నారు. పంజరానికి పరిమితమైన మీడియాకు స్వేచ్ఛ కల్పించాలని స్పీకర్​ను కోరారు. ‘‘పార్లమెంట్ భవనంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మీడియా ప్రతినిధులు సభ్యుల బైట్ రికార్డు చేస్తుంటారు. వారిని ఇప్పుడు పంజరంలో బంధించారు. 

ఎవరినీ అక్కడి నిలబడేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు’’అన్నారు. దీనిపై చర్చించి సమస్య పరిష్కరిస్తానని స్పీకర్ బదులిచ్చారు. కాగా, ఆంక్షలు విధించడాన్ని జర్నలిస్టులు ఖండించారు. మకర్ ద్వార్ నుంచి పంపించేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కరోనా సమంలో విధించిన ఆంక్షలు.. ఇప్పుడు విధించడాన్ని తప్పుబట్టారు. ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అని మండిపడ్డారు.

నిర్మల మేడమ్.. ప్లీజ్ ఇది నవ్వే ముచ్చట కాదు

రైతు సంఘాలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదని రాహుల్ మండిపడ్డారు. చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారిని ట్యాక్స్​ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అర్ధరాత్రిళ్లు ఫోన్ చేసి సతాయిస్తున్నారని మండిపడ్డారు. దేశాభివృద్ధిలో 73శాతం ప్రజలకు న్యాయం దొరకడం లేదన్నారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర ఎంత ఉందనేది 73శాతం ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. హల్వా దొరక్కపోయినా.. వారి కంట్రిబ్యూషన్ గురించి ఆలోచిస్తున్నరు’’అని అన్నారు. రాహుల్ కామెంట్లకు నిర్మలా సీతారామన్ నవ్వుకున్నారు. 

ఇది చూసిన రాహుల్.. ‘‘మేడమ్ ఇది నవ్వే ముచ్చట కాదు.. మీరు అలా నవ్వొద్దు.. ఆలోచించాల్సిన విషయమిది. మీరు తీసుకునే నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి’’అని అన్నారు. ‘‘పద్మవ్యూహంలో ఉన్నది సాధారణ ప్రజలు, యువకులని బీజేపీ వాళ్లు అనుకుంటున్నరు. కానీ.. అక్కడ ఉన్నది అభిమన్యులు కాదు.. అర్జునులు.. మీ పద్మవ్యూహాన్ని ఛేదిస్తారు. ఇందులో ఇండియా కూటమి మొదటి అడుగు వేసేసింది. మీ ప్రధానమంత్రి కాన్ఫిడెన్స్​ను విరిచేసింది. అందుకే మోదీ సభకు రావడం లేదు. ఇప్పుడు చెప్తున్నా.. మీరంతా వినండి.. నేను మాట్లాడుతున్నప్పుడు మోదీ సభకే రారు”అని రాహుల్ అన్నారు.

క్యాపిటల్ గెయిన్స్​పై ట్యాక్స్​తో వెన్నుపోటు పొడిచారు

ఇండియా అంటే హింస, ద్వేషం అని బీజేపీ వాళ్లు అనుకుంటున్నారని రాహుల్ అన్నారు. ‘‘మోదీ ఆదేశిస్తే.. కరోనా టైమ్​లో మిడిల్ క్లాస్ ప్రజలు పళ్లాలు కొట్టారు. అప్పుడు మాకేం అర్థం కాలేదు. తర్వాత సెల్​ఫోన్ టార్చ్ ఆన్ చేయండి అన్నారు.. అదీ చేశారు. అలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు బడ్జెట్​లో మీరు ఏమిచ్చారు? ఒక కత్తి వీపులో, ఇంకో కత్తి ఛాతిలో దించారు. ఇండెక్సేష న్ ఎత్తేసి వెన్నుపోటు పొడిచారు. 

క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్​తో ఛాతిలో పొడిచారు. లాంగ్​టర్మ్ క్యాపిటల్ గెయిన్స్​పై ట్యాక్స్​ను 10 శాతం 12.50 శాతానికి పెంచారు. షార్ట్​టర్మ్ క్యాపిటల్ గెయిన్స్​పై ట్యాక్స్​ను 15 శాతం నుం చి 20 శాతానికి పెంచారు. ఇది ఎంతో బాధపడా ల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ ప్రజలే మీకు బుద్ధి చెప్పబోతున్నారు’’అని రాహుల్ అన్నారు.

ఏ మతాన్నీ కించపర్చలేదు

సేవ చేసేవాళ్లను ఎవరూ ఆపలేరని రాహుల్ అన్నారు. ‘‘గురుద్వారాలోని లంగర్ నుంచి ఎవరినీ బలవంతంగా బయటికి పంపించరు. మసీదు నుంచి ఎవర్నీ గెంటేయరు. ఎవరైనా మసీదుకు, చర్చికి వెళ్లొచ్చు. ఎవరూ.. ఎవర్నీ.. ఆపరు. బీజేపీవాళ్ల చక్రవ్యూహంలో మాత్రం ఆరుగురే ఉన్నరు. వీళ్లే దేశాన్ని కంట్రోల్ చేస్తు న్నరు. పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తది. 

హిందూ సమాజం గురించి మీకు ఏమీ తెల్వదు. నేను ఏ మతాన్ని కించపర్చలేదు. నేను చచ్చిపోయే వరకు ఎవరినీ కించపర్చను’’అని అన్నారు. కాగా.. రాహుల్ ప్రసంగిస్తున్న టైంలో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగా న్ని అడ్డుకునేందుకు యత్నించారు. స్పీకర్ ఓంబిర్లా కలగజేసుకొని ఒకరు ప్రసంగిస్తున్న ప్పుడు అడ్డుతగలడం సబబు కాదని.. సభా మర్యాదలను పాటించాలని కోరారు.

అగ్నిపథ్​పై రాహుల్ వర్సెస్ రాజ్​నాథ్ సింగ్

అమరులైన అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ చెప్పారని రాహుల్ అన్నారు. అయితే, ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని, అది కేవలం ఇన్సూరెన్స్‌‌  మాత్రమే ఇస్తున్నదని స్పష్టం చేశారు. దీనిపై రాజ్​నాథ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమైన ‘అగ్నిపథ్‌‌ ’ పథకాన్ని రాహుల్‌‌  గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇదే అంశంపై పార్లమెంటులో ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్న. బడ్జెట్‌‌ పైనా అపోహలు వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నరు. దేశ సరిహద్దు రక్షణలో జవాన్లు నిమగ్నమై ఉంటారు. జాతీయ భద్రతకు సంబంధించి సున్నితమైన అంశమిది’’అని రాజ్​నాథ్ అన్నారు.