
న్యూఢిల్లీ: అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బాధితుల పిల్లలకు ఉద్యోగం కూడా ఇవ్వాలన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని ఆయన లేవనెత్తారు. ఆందోళనల్లో చనిపోయిన రైతుల డేటా మెయింటేన్ చేయడంలో మోడీ సర్కారు ఫెయిల్ అయిందని ఆరోపించారు. పంజాబ్, హర్యానాలో నష్టపరిహారం, ఉద్యోగాలు పొందిన రైతుల కుటుంబాల వివరాలను సభ ముందుంచారు. ‘‘అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా జరిగి న ఆందోళనల్లో దాదాపు 700 మంది రైతులు చనిపోయారు. తన తప్పు తెలుసుకుని ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారు” అని రాహుల్ చెప్పారు. ‘‘పంజాబ్ ప్రభుత్వం 400 మందికిపైగా రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. 152 మందికి ఉద్యోగాలిచ్చింది. హర్యానాలో 70 రైతు కుటుంబాలు ఉన్నాయి. ఆ లిస్టు నా దగ్గర ఉంది’’ అని తెలిపారు.