ఎప్‌‌స్టీన్ ఫైల్స్‌‌లో పేర్లుండడమే సిగ్గుచేటు: ప్రధానిమోదీకి రాహుల్ కౌంటర్

ఎప్‌‌స్టీన్ ఫైల్స్‌‌లో పేర్లుండడమే సిగ్గుచేటు: ప్రధానిమోదీకి రాహుల్ కౌంటర్
  • ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘మురికి రాజకీయాల’ విమర్శలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఘాటుగా బదులిచ్చారు. ఎప్‌‌స్టీన్ ఫైల్స్‌‌లో ప్రధానితో పాటు ఒక కేంద్ర మంత్రి పేరు ఉండటం, భారత్– -అమెరికా ట్రేడ్ డీల్‌‌ లో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అసలైన సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. 

పారిశ్రామికవేత్త  గౌతమ్ అదానీపై అమెరికాలో జరుగుతున్న కోర్టు కేసు ప్రధాని మోదీని రాత్రిపూట నిద్రపోనివ్వడం లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై కేసు కాదని, బీజేపీ ఆర్థిక మూలాలపై జరుగుతున్న విచారణ అని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో 14 నెలలుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. 

ప్రధాని ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేశ ప్రయోజనాల పరిరక్షణలో కాంగ్రెస్  అంగుళం కూడా వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ప్రధాని మోదీ సిగ్గు గురించి మాట్లాడుతున్నారా? ఎప్‌‌స్టీన్ ఫైల్స్‌‌లో మీ పేరు, మీ మంత్రి పేరు, మీ స్నేహితుడి పేరు బయటికి రావడం సిగ్గుచేటు.

 అమెరికాతో మీరు చేసుకున్న ట్రేడ్‌‌ డీల్‌‌తో దేశాన్ని అమ్మేశారు. రైతులను తుడిచిపెట్టారు. వస్త్ర పరిశ్రమను నాశనం చేశారు” అని విమర్శించారు. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే నేరస్తుడి డైరీలో కేంద్రమంత్రి పేరు రావడం దేశానికే అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.