కుల గణన  దేశానికి ఎక్స్ రే

కుల గణన  దేశానికి ఎక్స్ రే
  • అది చేస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు: రాహుల్ 
  • తెలంగాణతో మాకున్నది కుటుంబ బంధం
  • భూపాలపల్లిలో బైక్ ర్యాలీ, రోడ్ షో

జయశంకర్​భూపాలపల్లి/కాటారం, వెలుగు: తెలంగాణతో తమకున్నది రాజకీయ బంధం కాదని, కుటుంబ బంధమని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. అందుకే తన చెల్లెలు ప్రియాంకగాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చానని చెప్పారు. ‘‘కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్​రూ.లక్ష కోట్ల అవినీతి చేసిండు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించి, తెలంగాణలో దొరల పాలనను అంతం చేద్దాం” అని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర గురువారం రెండోరోజు భూపాలపల్లి జిల్లా కాటారం చేరుకుంది. ఇక్కడ రోడ్​షోలో, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.

‘‘కుల గణన అనేది దేశానికి ఎక్స్ రే లాంటిది. దేశంలో కుల గణన చేపడితేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి” అని చెప్పారు. ‘‘దేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఆఫీసర్లలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్లు ఉన్నారో చెప్పాలని నేను పార్లమెంట్ లో ప్రశ్నించాను. అన్ని శాఖల్లో కలిపి కేవలం కేవలం 5 శాతం మంది మాత్రమే ఈ మూడు వర్గాలకు చెందినోళ్లు ఉన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలి” అని అన్నారు. కాగా, భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో రేవంత్​రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, శ్రీధర్​బాబు తదితరులు పాల్గొన్నారు.