- పెట్రో ధరల పెంపుపై రాహుల్ ఫైర్
- సామాన్యుడిపై ‘ఇన్ ఫ్లేషన్ మ్యాన్’ కొరడా ఝళిపించాడని కామెంట్
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచి సామాన్యుల నడ్డి విరగ్గొట్టారని ప్రధాని నరేంద్ర మోదీపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మోదీ మళ్లీ దోపిడీ ప్రారంభించారని ‘ఎక్స్’ లో ఆయన విమర్శించారు.
ఎన్నికలు ముగియగానే గ్యాస్, ఇంధన ధరలు పెంచడం ‘ఇన్ ఫ్లేషన్ మ్యాన్’ (మోదీ) కు అలవాటైందని ధ్వజమెత్తారు. ‘‘ద్రవ్యోల్బణ మనిషి ప్రజలపై మరోసారి కొరడా ఝళిపించాడు. ఇదివరకే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ను దాదాపు రూ.వెయ్యి పెంచాడు. సీఎన్జీ ధరలను కూడా రూ.2 పెంచాడు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచి ప్రజల నెత్తిపై మళ్లీ భారం వేశాడు.
మోదీ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఈ దోపిడీ ఇక్కడితో ఆగదు. త్వరలో వాయిదాల రూపంలో మరింత లూటీ చేస్తారు” అని రాహుల్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన ధరలు తగ్గినపుడు కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ఒక్క రూపాయి లబ్ధి కూడా చేకూర్చలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ మండిపడ్డారు. ‘‘ఇప్పుడు పశ్చిమాసియాలో సంక్షోభాన్ని సాకుగా చూపి ధరలు పెంచారు.
మరి 2014 నుంచి మొన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గాయి కదా. సామాన్యులకు వాటి తాలూకు లబ్ధి ఎందుకు ఇవ్వలేదు? గ్యాస్ ధరలతో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా వెంటనే తగ్గించాలి” అని రమేశ్ ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ చేతకానితనం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం ఆరు శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
- ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మోదీ ఫెయిల్: డీకే
అంతర్జాతీయ సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫెయిల్ అయ్యారని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శించారు. ‘‘పరిస్థితులను మోదీ మేనేజ్ చేయలేకపోతున్నారు. వాహనాలు వాడొద్దని చెబుతున్నాడు. వెహికల్ వాడకుండా సామాన్యుడు ఎలా బతకగలడు? కావాలంటే సెక్యూరిటీ తగ్గించుకోవాలని నీ సెంట్రల్ మినిస్టర్లకు చెప్పు” అని డీకే ఎద్దేవా చేశారు.
గత 12 ఏండ్ల పాటు యుద్ధం జరగని టైంలో కూడా మోదీ సర్కారు ధరలు పెంచిందని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ అన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినపుడు, యుద్ధాలు లేని టైంలో కూడా ఎక్సైజ్ డ్యూటీని మోదీ సర్కారు 16 రెట్లు పెంచిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు పశ్చిమాసియాలో సంక్షోభాన్ని సాకుగా చూపి ప్రజలపై భారం వేశారని ఆయన మండిపడ్డారు.
