ట్రంప్ ఆదేశాలను మోదీ అమలు చేస్తున్నరు..అమెరికాకు లొంగిపోయాడంటూ రాహుల్ గాంధీ ఫైర్

ట్రంప్ ఆదేశాలను మోదీ అమలు చేస్తున్నరు..అమెరికాకు లొంగిపోయాడంటూ రాహుల్ గాంధీ ఫైర్
  • భారత నావికులు మరణిస్తే ట్రంప్​లో పశ్చాత్తాపమే లేదు
  • పైగా భారత్ కే ఆదేశాలు జారీ చేస్తున్నాడని విమర్శ
  • అయినా ప్రధాని మోదీ మౌనం వీడట్లేదని ఆగ్రహం

న్యూఢిల్లీ: అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన ఘటనపై యూఎస్ స్పందించిన తీరు, ఆ దేశ ప్రకటనల నేపథ్యంలో  ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌ గాంధీ నిప్పులు చెరిగారు. లొంగిపోయిన ప్రధాని ఒక ‘విధేయుడైన సేవకుడిలా’ అమెరికా ఆదేశాలను అమలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఆదివారం  రాహుల్ గాంధీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రధానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

‘‘అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన తర్వాత ఆ దేశం నుంచి ఎలాంటి పశ్చాత్తాపం గానీ, క్షమాపణలు గానీ లేవు. పైగా భారత్‌‌‌‌ కే ఆదేశాలు జారీ చేస్తోంది. తమ సైనిక ఆదేశాలను తక్షణమే పాటించండి.. ఎలాంటి ఉల్లంఘనలను సహించేది లేదంటూ అమెరికా హెచ్చరిస్తోంది. ఏ సార్వభౌమ దేశమైనా ఇలాంటి భాషను సహించదు. కానీ మన లొంగిపోయిన ప్రధాని మాత్రం మౌనం వీడడంలేదు. ఒక విధేయుడైన సేవకుడిలా ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు’’ అని విమర్శించారు.

దేశాన్ని అవమానించే వారికి రుణపడి ఉన్నారు..

 దేశాన్ని అవమానించే వారికి రుణపడి ఉన్న ప్రధాని మోదీ.. దేశ గౌరవాన్ని కాపాడలేరని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. హార్మూజ్‌‌‌‌ వద్ద తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చట్టవిరుద్ధంగా చమురు రవాణా చేస్తే సహించేదిలేదని భారత్‌‌‌‌కు  అమెరికా హెచ్చరికలు జారీ చేసిన మరుసటి రోజే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరో పోస్టులో దుక్మ్ నౌకాశ్రయంలో ఉన్న ‘ఎంటి సెలెస్టియల్’ నౌకలో వైద్య సమస్యల వల్ల మరణించిన మరో భారతీయ నావికుడి మృతదేహం కుళ్ళిపోతోందన్న కెప్టెన్ ఆవేదనను ప్రస్తావిస్తూ.. ‘ఆ భారతీయుడిని తక్షణమే స్వదేశానికి తీసుకురండి’ అని రాహుల్ డిమాండ్ చేశారు.

దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు: ఖర్గే

దేశ ప్రయోజనాలను ప్రధాని మోదీ తాకట్టు పెడుతున్నారని ఏఐసీసీ చీఫ్‌‌‌‌ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ‘‘దేశాన్ని తలవంచనివ్వను అని మోదీ చెప్పారు. కానీ ఇప్పుడు దేశ సార్వభౌమత్వాన్ని దిగజార్చారని చెప్పడానికి వేరే రుజువులు అక్కర్లేదు. దీనిని మళ్లీ విశ్వగురువు అనే మాటలతో కప్పిపుచ్చాలని చూస్తున్నారు. భారత్ గతంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని, అలీన విధానాన్ని పాటించినప్పుడే ప్రపంచం మన మాట విన్నది, అప్పుడే భారత్ విశ్వగురువుగా నిలిచింది’’ అని వ్యాఖ్యానించారు. భారతీయ నావికుల మృతిపై ప్రభుత్వ మౌనం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.