రాహుల్ గాంధీతో భేటీ కానున్న రాష్ట్ర నేతలు

రాహుల్ గాంధీతో భేటీ కానున్న రాష్ట్ర నేతలు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ కీలక నేతలు ఇవాళ సాయంత్రం సమావేశం కానున్నారు. నేతల మధ్య అంతర్గత విభేదాలు, పార్టీ బలోపేతంపై రాహుల్‌తో చర్చించనున్నారు. రాష్ట్ర పీసీసీ నేతలతోపాటు మాజీ మంత్రులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు తుగ్లక్ రోడ్ లోని రాహుల్ నివాసంలో జరిగే ఈ సమావేశానికి.. 30మంది పీసీసీ నేతలతో పాటు మరో 10 మంది మాజీ మంత్రులకు ఆహ్వానాలు అందాయి. కొద్ది నెలలుగా పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు, నేతల మధ్య కుమ్ములాటలు, పార్టీ బలోపేతంపైనే ఈ సమావేశం సాగనుంది. చాలాకాలంగా కొందరు అసమ్మతి నేతలు.. లాయలిస్టుల పేరుతో సమావేశాలు నిర్వహించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై.. ఇప్పటికే వందల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన నేతలు.. నేరుగా అధినేత్రి సోనియాగాంధీకి కంప్లైంట్ చేయాలని ప్రయత్నించారు. మూడ్రోజులపాటు ఢిల్లీలో ఉన్నా.. సోనియా అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో ఇవాళ రాహుల్‌తో జరిగే భేటీలో.. రేవంత్ వ్యవహారంపై నేరుగా ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు. సీనియర్లను పట్టించుకోకుండా.. రేవంత్ వన్ మ్యాన్ షో చేస్తున్నాడని అసమ్మతి నేతలు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

కర్ణాటక, తెలంగాణల వ్యూహకర్త రిపోర్ట్స్‌

ఈ రోజు ఉదయం కర్ణాటక నేతలో భేటీ నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ.. సాయంత్రం తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోపాటు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా సమావేశంలో హాజరుకానుట్లు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సునీల్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా సునీల్ వర్కవుట్ మొదలుపెట్టారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ బలం, బలహీనతలపై ఇప్పటికే ఓ రిపోర్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ నియెజకవర్గాల వారీగా ఎలాంటి పరిస్థితి ఉంది, నేతల పనితీరు ఎలా ఉందనే అంశాలపై సర్వేలు చేసిన సునీల్.. ఇవాళ ఆ రిపోర్ట్ ను రాహుల్ ముందుంచనున్నట్లు సమాచారం.

అంతర్గత కుమ్ములాటలపై..

ఐదు రాష్ట్రాల్లో ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్.. ఆ ఎఫెక్ట్ మిగతా రాష్ట్రాలపై పడకుండా జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ కు బలమున్న రాష్ట్రాలపై ముందుగా ఫోకస్ పెట్టింది అధిష్టానం. అందులో భాగంగానే ఇవాళ కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి.. ఏకతాటిపై ముందుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని ఇవాళ్టి మీటింగ్ లో దిశానిర్దేశం చేయనుందని తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

లంకలో సంక్షోభం: ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా

మేక తోలుకు రంగేసి పులి చర్మం పేరుతో విక్రయం

గూగుల్ పేలో ట్యాప్ టు పే