బెంగాల్, అస్సాంలో ప్రజా తీర్పును దొంగిలించారు: రాహుల్ గాంధీ

బెంగాల్, అస్సాంలో ప్రజా తీర్పును దొంగిలించారు: రాహుల్ గాంధీ
  • ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తున్నది: రాహుల్​ గాంధీ
  •   మమత ఆరోపణలతో ఏకీభవిస్తున్నట్టు వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: బెంగాల్, అస్సాంలో తృణముల్ కాంగ్రెస్ ఓటమిపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలకు కాంగ్రెస్​అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ హితవు పలికారు. అస్సాం, బెంగాల్ లో ప్రజా తీర్పును దొంగిలించడం ప్రజాస్వామ్య ఖూనీకి తొలి అడుగు అన్నారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా బీజేపీపై ఆయన ఫైర్ అయ్యారు. 

‘కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోని కొందరు, ఇతర పార్టీల నేతలు  బెంగాల్ లో టీఎంసీ ఓటమిని చూసి సంబరపడుతున్నారు. అస్సాం, బెంగాల్ ప్రజల తీర్పును అపహరించడం అనేది దేశ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే తన లక్ష్యంలో బీజేపీ  వేసిన ఒక భారీ ముందడుగు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో చిల్లర రాజకీయాలను పక్కన పెట్టాలని హితవు పలికారు. ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదని, దేశానికి సంబంధించిన అంశమని గుర్తు చేశారు. 

కాగా.. కేంద్ర ఎన్నికల సంఘం సపోర్ట్ తో  ప్రజా తీర్పును బీజేపీ దొంగలించడంలో అస్సాం, బెంగాల్ స్పష్టమైన ఉదాహరణలని గత ట్వీట్ లో ఆరోపించారు. బెంగాల్ లో 100 స్థానాలకు పైగా దొంగలించారని బెంగాల్​సీఎం మమతా బెనర్జీ ఆరోపణలతో తాము ఏకీభవిస్తున్నట్టు రాహుల్ వెల్లడించారు. బీజేపీ.. ఇదే వ్యూహాన్ని 2024 హర్యానా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర ఎన్నికల్లో అమలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 

సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. బెంగాల్‌‌‌‌‌‌‌‌లో తృణమూల్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను ఓడించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోగా, అస్సాంలో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.