25 శాతం ఎంపీ సీట్లలో వాళ్లపై వాళ్లే పోటీ పడుతున్నరు

25 శాతం ఎంపీ సీట్లలో వాళ్లపై వాళ్లే పోటీ పడుతున్నరు
  •    ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలపై మోదీ ఎద్దేవా
  •     రాహుల్ కు వయనాడ్​లో ఓటమి తప్పదు
  •     మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల సభల్లో ప్రధాని

నాందేడ్/పర్భనీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో అన్నీ స్వార్థపూరిత పార్టీలే ఉన్నాయని, తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే అవి కూటమి కట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ కూటమిలోని పార్టీలు 25 శాతం ఎంపీ సీట్లలో తమపై తామే పోటీ చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. దేశ భవిష్యత్తును చూపగల వ్యక్తి ఎవరన్నది కూడా చెప్పలేని పరిస్థితిలో ఆ కూటమిలోని పార్టీలు ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలను నమ్మొద్దని, ఈ ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలోని నాందేడ్, పర్భనీ జిల్లాల్లో జరిగిన బీజేపీ రెండు ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లోనే కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని ఆయన ఎద్దేవా చేశారు. 

ఇండియా కూటమిని ఓటర్లు ఫస్ట్ ఫేజ్ లోనే రిజెక్ట్ చేశారన్నారు. ‘‘ప్రజలకు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లకు అభినందనలు, ధన్యవాదాలు. నాకు అందిన సమాచారం మేరకు ఎన్డీఏకు అనుకూలంగా ఓటింగ్ ఏకపక్షంగా జరిగింది. మీ అందరికీ నేను తలవంచి థ్యాంక్స్ చెప్తున్నా” అని అన్నారు. దేశంలో ఎండలు పెరిగిపోతున్నాయని, రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారని, పెండ్లిండ్ల సీజన్ కూడా ఉందని.. అయినా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. దేశానికి భద్రమైన భవిష్యత్తు అందించడం కోసమే తప్పనిసరిగా ఓటు వేయాలన్నారు.. 

కాంగ్రెస్ పార్టీ తీగలా పిప్పి చేస్తది.. 

కాంగ్రెస్ పార్టీ చెట్ల మీద పెరిగే తీగలాంటిదని, సపోర్ట్ చేసిన వాళ్లనే అది పీల్చి పిప్పి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్, వికసిత్ మహారాష్ట్ర లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని, ప్రతిపక్ష ఇండియా కూటమి విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 సాకుతో రాజ్యాంగం అమలుకారాదని భావిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన సమస్యలను గత పదేండ్లుగా తాము ఫిక్స్ చేస్తున్నామన్నారు. వచ్చే 25 ఏండ్లు  ప్రపంచంలో ఇండియాను గొప్ప స్థానంలో నిలబెట్టే కాలమని మోదీ అన్నారు. 

26 తర్వాత రాహుల్ సేఫ్ సీటు చూస్కుంటరు.. 

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ 2019లో అమేథీలో ఓడిపోయినట్టుగానే.. ఈసారి వయనాడ్ లో కూడా ఓడిపోతారని మోదీ చెప్పారు. ‘‘వయనాడ్ లో గెలుపుపై రాహుల్ గాంధీ అనుమానంతో ఉన్నారు. ఏప్రిల్ 26న ఓటింగ్ అయ్యేంతవరకు చూసి.. ఆ తర్వాత వేరొక సేఫ్ సీటును చూసుకుందామని అనుకుంటున్నారు. ప్రజలు వికసిత్ భారత్ కు మాత్రమే ఓటు వేస్తారు తప్ప.. ఇలాంటి వారికి ఓటేసి తమ ఓటును వేస్ట్ చేసుకోరు. రాహుల్ పై కేరళ సీఎం పినరయి విజయన్ కూడా విమర్శలు గుప్పించారు. నేను కూడా అలాంటి మాటలు ఎన్నడూ అనలేదు” అని మోదీ అన్నారు. కొందరు ఇండియా కూటమి నేతలు ఎన్నో ఏండ్లుగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారని.. కానీ ఇప్పుడు ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేక రాజ్యసభకు వెళ్తున్నారంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.

సీఏఏ లేకుంటే అఫ్గాన్ సిక్కుల గతేంటీ? 

మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, ఫేక్ శివసేన (ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని పార్టీ) టెర్రరిస్ట్ యాకుబ్ మెమన్ సమాధిని అలంకరించే పనిలో బిజీగా ఉన్నాయన్నారు. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన మెమన్​ను 2015లో ఉరి తీశారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నప్పుడు నిజాం రాజ్యమే ఇంకా ఉందని అనుకున్నారు. రజాకార్ మనస్తత్వం పెరిగిపోయింది. యాకుబ్ మెమన్ సమాధిని అలంకరించడానికే వారు ప్రాధాన్యం ఇచ్చారు” అని మోదీ ఆరోపించారు. అఫ్గానిస్తాన్ నుంచి సిక్కులు శరణార్థులుగా ఇండియాకు వచ్చారని, సిటిజన్​షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ) లేకపోతే వారి గతి ఏమై ఉండేదని ప్రశ్నించారు. తన హయాంలో చంద్రయాన్ మిషన్ సక్సెస్ అయిందని.. వచ్చే టర్మ్ తన ప్రభుత్వంలో గగన్ యాన్ సక్సెస్ ను కూడా చూస్తామన్నారు. ‘‘నేను పేదరికంలో పెరిగాను. పేదల కష్టాలు, బాధలు బాగా తెలుసు. నేను అనుభవించిన కష్టాలు పేదలెవరికీ రాకూడదు” అని చెప్పారు.