విద్యావ్యవస్థలో లోపాలతో పిల్లలపై ఒత్తిడి.. విద్యార్థి గర్జనలో రాహుల్

విద్యావ్యవస్థలో లోపాలతో పిల్లలపై ఒత్తిడి.. విద్యార్థి గర్జనలో రాహుల్
  •   లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణ
  •     ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరుతో కోటాలో మెగా ర్యాలీ
  •     టెలిగ్రామ్ యాప్‌‌ను బ్యాన్ చేయడంపై మండిపాటు

జైపూర్/ న్యూఢిల్లీ: దేశంలోని విద్యావ్యవస్థ పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తూ.. వారి జీవితాన్ని నాశనం చేస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రీ-నీట్ పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక సికార్‌‌‌‌‌‌‌‌లో ఉమేశ్(22), డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లో రియా(23) అనే ఇద్దరు స్టూడెంట్లు సూసైడ్ చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. విద్యావ్యవస్థలో లోపాలకు బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం రాహుల్ ప్రముఖ కోచింగ్ హబ్‌‌‌‌‌‌‌‌గా పేరొందిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌లోని కోటాలో పర్యటించారు. ‘ఛాత్రోం కీ గూంజ్ (విద్యార్థుల గర్జన)’ పేరిట నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, మాట్లాడారు. ‘పిల్లలపై విద్యావ్యవస్థ ఒత్తిడిని మోపుతూ, వారిని మానసిక ఆందోళనకు గురిచేస్తున్నది.

ఇది మన దేశానికి మంచిది కాదు. తమ కలలు నెరవేర్చుకోవాల్సిన 22, 23 ఏండ్ల యువత.. విద్యావ్యవస్థలోని అవినీతికి  బలైపోతున్నారు. నిన్న సికార్‌‌‌‌‌‌‌‌లో ఉమేశ్, డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లో రియా.. ఇద్దరూ రీ-నీట్ ఒత్తిడితోనే సూసైడ్ చేసుకున్నారు. లక్షలాది మంది యువకుల కలలను ముక్కలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకులు, అస్తవ్యస్తంగా పరీక్షల నిర్వహణ, రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ల రద్దు, ఫీజుల పెంపు, స్కామ్‌‌‌‌‌‌‌‌లనే -ప్రతిరోజూ తన ఆయుధాలుగా వాడుతున్నది’ అని విమర్శించారు. ఇది రాజకీయ సభ కాదని.. భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువత సభ అని రాహుల్ వెల్లడించారు.‘‘విద్యావ్యవస్థలోని లోపాలతో మీరు అనుభవించిన వేదనను మళ్లీ భవిష్యత్తులో ఎవరూ అనుభవించకుండా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. పేపర్ లీకుల వల్ల ఏ తల్లిదండ్రులు తమ బిడ్డను  కోల్పోకూడదు.. ఇకపై ఏ బిడ్డ కలలు ముక్కలు కాకూడదనే లక్ష్యంతో కోటా నుంచే మేం పోరాటాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సభతో ప్రతి కుటుంబ బాధ ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘విద్యార్థుల గర్జన’గా మారుమోగుతుంది’’ అని రాహుల్ పేర్కొన్నారు.

పేపర్ లీక్ మాఫియాపై దాడి చేయండి.. 

కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌‌ యాప్‌‌పై తాత్కాలికంగా ఆంక్షలు విధించడంపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగను పట్టుకోవడానికి బదులు బాధితుడి ఇంటికి తాళంవేయడం లాంటి కొత్త ట్రిక్‌‌ను మోదీ ప్రభుత్వం ఫాలో అవుతున్నదని విమర్శించారు. ఇటువంటి చర్యలు చేపట్టే బదులు పేపర్ లీక్‌‌ మాపియాపై దాడి చేయాలని.. విద్యార్థులపై కాదని హితవు పలికారు. ఈ మేరకు బుధవారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘పేపర్ లీక్‌‌లను అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త ట్రిక్ టెలిగ్రామ్ బ్యాన్. ఇది దొంగను పట్టుకోవడానికి బదులు బాధితుడి ఇంటికి తాళం వేయడం లాంటిదే. లక్షలాది మంది విద్యార్థులు టెలిగ్రామ్‌‌లో నోట్స్, టెస్ట్ సిరీస్, డిస్కషన్స్, ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆ సదుపాయాన్ని లాగేసుకుంటే పేపర్ లీక్‌‌ల సమస్య ఎలా పరిష్కారమవుతుంది?  ఇది పూర్తి సురక్షితమైన మార్గం కూడా కాదు. ఈ విషయం దేశంలోని ప్రతి విద్యార్థికి, పేపర్ లీక్ మాఫియాకు 
కూడా తెలుసు. మరి తదుపరి నిషేధం దేనిపై ఉంటుంది? వాట్సాప్ పైనా?’’ అని ప్రశ్నించారు.