నేనేం నేరం చేశాను? .. నా ఒక్కడికే శాంతి భద్రతలు అడ్డొస్తాయా?

నేనేం నేరం చేశాను? ..  నా ఒక్కడికే శాంతి భద్రతలు అడ్డొస్తాయా?

నగావ్(అస్సాం) : ‘భారత్‌‌‌‌ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకున్నారు.  దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తనను అడ్డుకోవడానికి గల కారణమేంటని సిబ్బందిని ప్రశ్నించారు. గుడిలోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణ యిస్తున్నారని విమర్శలు చేశారు. ‘‘వైష్ణవ సన్యాసి శ్రీమంత శంకర్‌‌‌‌దేవ్ జన్మస్థలాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చు. అప్పుడు ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఉండదు. కానీ రాహుల్ గాంధీ మాత్రమే వెళ్లలేరు”అని ఆయన మండిపడ్డారు. ‘‘మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేమీ చేశాను..? మేం ఇక్కడకు వచ్చింది ప్రార్థించడానికి.. ఎలాంటి సమస్యలు సృష్టించడానికి కాదు’ అని రాహుల్ మీడియాతో మాట్లాడారు. 

రోడ్డుపై నిరసన తెలుపుతూ..

బతద్రవ సత్ర.. శ్రీమంత శంకరదేవ జన్మస్థలం. ఆయన 15వ శతాబ్దానికి చెందిన సాధువు. సోమ వారం రాహుల్​గాంధీ న్యాయ్​యాత్రలో భాగంగా శంకరదేవ జన్మస్థలానికి వెళ్తుండగా.. హైబర్‌‌‌‌గావ్‌‌‌‌లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్​గాంధీ రోడ్డుపై బైఠాయించి పార్టీ నాయకులు, మద్దతుదారులతో కలిసి నిరసన తెలిపారు. తన యాత్ర మార్గంపై ఒకసారి పునరాలోచించుకోవాలని ఆదివారం రాహుల్‌‌‌‌ను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కోరారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయన ఈ అభ్యర్థన చేశారు. సీఎం అభ్యర్థన తర్వాత శంకర దేవ సత్ర మేనేజింగ్​కమిటీ కూడా స్పందించింది. రాహుల్​గాంధీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఆలయాన్ని సందర్శించడం కుదరదని ఆదివారమే తేల్చి చెప్పింది. కాగా పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బతద్రవ ఎమ్మెల్యే సిబామోని బోరా శంకరదేవ సత్రను సందర్శించారు. అక్కడ ఎలాంటి రద్దీ లేదని, ఆలయ ప్రాంగణం మొత్తం ఖాళీగా ఉందని, అలాంటప్పుడు రాహుల్​గాంధీ వస్తే శాంతి భద్రతల సమస్య ఎలా వస్తుందని, ఇవన్నీ వట్టి పుకార్లేనని అన్నారు. రాహుల్‌‌‌‌ గాంధీ తరఫున శాంతి, సామరస్యం కోసం ప్రార్థించామని, కాంప్లెక్స్‌‌‌‌లో ఉన్న పూజారులందరూ ఆయనకు ఆశీస్సులు అందించారని గొగోయ్​ చెప్పారు. దీనిపై రాహుల్​గాంధీ స్పందిస్తూ.. ‘‘ఇది విచిత్రంగా ఉంది. ఇక్కడ శాంతిభద్రతల సమస్య ఏమీ లేదు. గౌరవ్ గొగోయ్ సహా అందరూ వెళ్తున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రమే అక్కడకు వెళ్లాలేరా?’’ అని ఆయన ప్రశ్నించారు. 

స్ట్రీట్​ కార్నర్​ మీటింగ్​కు నో పర్మిషన్​

భారత్‌‌‌‌ జోడో న్యాయ యాత్రలో భాగంగా మోరిగావ్‌‌‌‌ జిల్లాలో రాహుల్​గాంధీ చేపట్టే పాదయాత్రను, స్ట్రీట్‌‌‌‌ కార్నర్‌‌‌‌ సమావేశాన్ని నిలిపేయాలని జిల్లా యంత్రాంగం సూచించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ‘‘ఒకే రోజు జరుగుతున్న రెండు ప్రధాన కార్యక్రమాల(అయోధ్య ప్రాణప్రతిష్ఠ, జోడోయాత్ర)ను అదునుగా తీసుకుని దుండగులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారం. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యతతో పాటు రాహుల్ గాంధీ సెక్యూరిటీ దృష్ట్యా.. బిహుతోలిలో ప్రతిపాదిత స్ట్రీట్-కార్నర్ సమావేశాన్ని నిర్వహించొద్దు. మోరిగావ్ పట్టణంలో శ్రీమంత శంకరదేవ చౌక్ నుంచి పోలీసు పాయింట్ వరకు పాదయాత్రను నిలిపేయాలని అభ్యర్థిస్తున్నాం. రోడ్‌‌‌‌షోలో భాగంగా వాహనాలను ఎక్కడా ఆపొద్దు’’ అని జిల్లా ఉన్నతాధికారులు కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి లేక రాశారు.