వాట్ నెక్ట్స్ : ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు.. ఎలా బయటపడతారు

వాట్ నెక్ట్స్ : ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు.. ఎలా బయటపడతారు

రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు పడింది.. కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో ఆయన ఎంపీగా అనర్హుడు అని లోక్​ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించటం సంచలనం అయ్యింది. జరగాల్సింది జరిగిపోయింది.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు అనేది ఇంట్రస్టింగ్ పాయింట్ అయ్యింది. కాంగ్రెస్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటీ.. అనర్హత వేటు నుంచి బయటపడే మార్గాలు లేవా అనే చర్చ మొదలైంది.

>>> సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టులో సవాల్ చేయటం. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇమేజ్ దృష్ట్యా నేరుగా సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి.
>>> పైకోర్టు లేదా అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై స్టే విధిస్తే అనర్హత వేటు నుంచి బయటపడే ఛాన్స్ ఉంది.
>>>  సూరత్ కోర్టు తీర్పుపై గుజరాత్ హైకోర్టుకు వెళతారా లేక నేరుగా సుప్రీంకోర్టులోనే సవాల్ చేస్తారా అనేది ఆసక్తి రేపుతుంది. ఏ కోర్టు అయినా తీర్పుపై స్టే విధించినట్లయితే రాహుల్ గాంధీ యథావిధిగా ఎంపీగా కొనసాగుతారు. 
>>> ప్రస్తుతం సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధం అయిన క్రమంలోనే.. లోక్ సభ అనర్హత వేటు వేయటం ద్వారా రాజకీయ కక్షగా చెబుతోంది. రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది. 
>>> సెక్షన్ 8(3) 1951 చట్టం ప్రకారం ఏదైనా కేసులో ప్రజాప్రతినిధి రెండేళ్లు లేదా అంత కంటే ఎక్కువ శిక్ష పడినట్లయితే.. తన పదవిని కోల్పోయినట్లే అని చట్టం చెబుతుంది. ఈ చట్టం కిందే ఇప్పుడు లోక్​ సభ జనరల్ సెక్రటరీ.. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తూ.. నోటీస్ జారీ చేశారు.

ప్రధాని మోడీ ఇంటిపేరుతో ఉన్న వాళ్లందరూ దొంగలే అంటూ  2019లో కర్నాటక రాష్ట్రంలో చేసిన వ్యాఖ్యలపై.. 2023, మార్చి 23వ తేదీన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే బెయిల్ మంజూరు చేసింది. నెల రోజుల గడువు ఉండటంతో.. తీర్పును సవాల్ చేయాలనే సమాలోచనలు చేస్తున్న సమయంలోనే.. రాహుల్ గాంధీ ఎంపీగా చెల్లుబాటు కారని లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించటం రాజకీయ దుమారం రేపుతోంది. 

రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌తో సంప్రదించి ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటే రాష్ట్రపతి మాత్రమే చేయగలరని, ఈ చర్యకు చట్టబద్ధత ఏమిటని ప్రశ్నిస్తు్న్నారు.