
- తమ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో వారికి
- ప్రభావవంతమైన విధానాలు అమలు చేస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తమ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభావవంతమైన విధానాలు అమలు చేస్తామని ట్విట్టర్ లో ఆయన హామీ ఇచ్చారు. అలాంటి విధానాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేలా ఇండియా కూటమి తరపున కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఉబెర్ క్యాబ్ లో తాను ప్రయాణించిన వీడియోను ఆయన పోస్టు చేశారు. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడి ఆయన సమస్యలను రాహుల్ తెలుసుకున్నారు. ‘‘క్యాబ్ డ్రైవర్ సునీల్ తో మాట్లాడి ఆయన సమస్యలు తెలుసుకున్నా. ఒకవైపు చాలీచాలని ఆదాయం, మరోవైపు పెరిగిన ద్రవ్యోల్బణంతో తమ బతుకులు దుర్భరంగా మారాయని ఆయన చెప్పారు. ఢిల్లీలో ఖర్చులు భరించలేక తన సొంత రాష్ట్రం యూపీకి తిరిగివెళ్లాలని కూడా నిర్ణయించుకున్నానని ఆయన తెలిపాడు. రోజంతా కష్టపడినా వారికి ఆదాయం మిగలడం లేదు. వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. మా ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అలాంటి గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తాం. వారికి సామాజిక భద్రత కల్పిస్తాం” అని రాహుల్ తెలిపారు. కాగా, రైడ్ తర్వాత క్యాబ్ డ్రైవర్ కుటుంబ సభ్యులతో రాహుల్ లంచ్ చేశారు. డ్రైవర్ పిల్లలకు ఒక గిఫ్ట్ ఇచ్చారు.
చిన్ననాటి ఫోటోతో ప్రియాంక రక్షాబంధన్ శుభాకాంక్షలతో
రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉండే తోబుట్టువులు అన్నాచెల్లెళ్లు. సోదరులు, సోదరీమణుల మధ్య సంబంధం ఫ్లవర్ గార్డెన్ వంటిది. వారిద్దరూ కలిసి ఎన్నో రంగురంగుల తీపి జ్ఞాపకాలు అందిస్తారు” అని ప్రియాంక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌తో తాను దిగిన ఫొటోలను ఆమె షేర్ చేశారు. అలాగే రాహుల్ సైతం దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధం చెరిగిపోని ప్రేమ, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు.