RSS  పుట్టక ముందు నుంచే ఈ టోపీ ఉంది

RSS  పుట్టక ముందు నుంచే ఈ టోపీ ఉంది

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన నల్ల టోపీని ఆర్‌‌ఎస్‌ఎస్‌కు లింక్ పెట్టి మాట్లాడారని, కాదని చెప్పినా అర్థం చేసుకోలేదని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ అన్నారు. రాహుల్‌కు గోల్వాల్కర్ ఎవరో... సావర్కర్ ఎవరో కూడా తెలియదన్నారు. తాను పెట్టుకున్న నల్ల టోపీని RSS తో లింక్ చేశారని సెటైర్లేశారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ తన దగ్గరకు వచ్చి నల్ల టోపీ ఎందుకు పెట్టుకుంటారని అడిగారని, దీనిని ఉత్తరాఖండ్‌లో ప్రజలు ఎప్పటి నుంచో సంప్రదాయంగా పెట్టుకుంటున్నారని చెబితే ఆయన వినలేదని అన్నారు. తాను ఆర్‌‌ఎస్‌ఎస్‌ వ్యక్తి కావడం వల్లే ఆ టోపీ పెట్టుకుంటున్నట్టు రాహుల్ వాదించారని ఖోషియారీ చెప్పారు. తాను ఆర్‌‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్నానని, అయితే ఈ టోపీ మాత్రం ఉత్తరాఖండ్‌ సంప్రదాయం నుంచి వచ్చిందేనని చెప్పానని అన్నారు. ఆర్‌‌ఎస్‌ఎస్ పుట్టక ముందు నుంచే అక్కడి ప్రజలు ఈ టోపీని పెట్టుకుంటున్నారని ఆయనకు వివరించానని తెలిపారు.

కొన్ని నెలల తర్వాత రాహుల్‌ గాంధీ మళ్లీ తన వద్దకు వచ్చి నల్ల టోపీ గురించి అడిగారని, ఆ సమయంలో తాను ఆర్‌‌ఎస్‌ఎస్ గురించి మీరేమైనా చదివారా అని రాహుల్‌ను ప్రశ్నించానని  భగత్ సింగ్ ఖోషియారీ అన్నారు. దానికి రాహుల్... సావర్కర్ గురించి చదివానని చెప్పారని అన్నారు. వీర్ సావర్కర్‌‌కు, ఆర్‌‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదన్న విషయం ఆయనకు తెలియలేదని, ఇలాంటి వ్యక్తులు ప్రతిపక్షంలో నాయకులుగా ఉంటే గత పార్లమెంట్‌ సెషన్‌లో చూసిన ఘటనలే జరుగుతాయని సెటైర్లు వేశారు. శనివారం జరిగిన ఒక బుక్‌ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు సభను అడ్డుకున్న తీరు చాలా బాధాకరమని అన్నారు.