
గత కొద్ది రోజులుగాఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రా్ల్లో ఎండలు రికార్డుస్థాయిలో నమోదు అవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉదయం పది దాటిందంటే చాలు ఇండ్లనుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
సముద్రంలో అల్పపీడన ద్రోణి కారణంగా మంగళవారం(మే13) నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో వర్షాలు కురిస్తాయని అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
రాగల మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
మంగళవారం వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.