- హైదరాబాద్‌లోనూ పలు చోట్ల వానలు
- అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెం.మీ వర్షం
- పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు: పది రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి. కొంచెం ఊరటనిచ్చేలా కొన్ని చోట్ల మోస్తరు వానలు కురిశాయి. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల మధ్యాహ్నం 2 గంటల సమయంలో వర్షం కురిసింది. రంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, ములుగు, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షం పడింది. మెదక్ జిల్లా రేగోడులో 4 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.6, సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో 3.4, రంగారెడ్డి జిల్లా చిల్కూరులో 3.2, వికారాబాద్‌లో 2.6, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 2.6, మోయినాబాద్‌లో 2.4, నల్గొండ జిల్లా నాంపల్లిలో 2.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, శుక్రవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేగాకుండా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అదే సమయంలో శనివారం కేవలం గాలుల ప్రభావమే ఉంటుందని పేర్కొంది.
