మరో రెండ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు

మరో రెండ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు
  • వడగండ్లు, పిడుగులూ పడొచ్చు
  • వాతావరణ శాఖ ఆరెంజ్​ అలర్ట్​


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. మరోసారి ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,  సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉందని తెలిపింది. ఆ జిల్లాలతోపాటు హైదరాబాద్​, సంగారెడ్డి, మెదక్​లో వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.


అర్ధరాత్రి దంచిన వాన

గురువారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్​తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. నల్గొండ, సంగారెడ్డి, కొత్తగూడెం, వనపర్తి, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాల్లోనూ నిన్న అర్ధరాత్రి మోస్తరు వర్షపాతం రికార్డైంది. హైదరాబాద్​లోని షేక్‌‌‌‌‌‌‌‌పేటలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా చింతకానిలో 7.8, ఎంకూరులో‌‌‌‌‌‌‌‌ 7.3, కొణిజెర్లలో 6.5, రాజేంద్రనగర్ 6.3, మొయినాబాద్ 6.1, శివరాంపల్లి 6, సూర్యాపేట జిల్లా మోతెలో 5.8, ఖుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌లో 5.7, శేరిలింగంపల్లిలో 5.6 సెంటీమీటర్ల వాన పడింది.