హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు జోరు వానలు పడనున్నాయి. ఇప్పటికే రాత్రికి రాత్రే కొన్ని గంటల్లోనే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులూ ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు, ద్రోణి ప్రభావం కారణంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నది. ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దాని ప్రభావంతో వారంపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక, ఆ తర్వాత వరుసగా 4 రోజులు అతిభారీ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నది. ఈ 4 రోజులకూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సిటీలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, ఈ వారం మొత్తం రాష్ట్రమంతటా ముసురు పడుతుందని తెలిపింది.
పలుచోట్ల భారీ వర్షాలు పడ్డయ్
రాష్ట్రంలో ఆదివారం దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 16 మండలాల్లో భారీ వర్షం పడగా.. 138 మండలాల్లో మోస్తరు, 350 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 11.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 9.1 సెంటీ మీటర్లు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 8.1, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.7, పెద్దపల్లి జిల్లా ఎక్లాస్‌పూర్‌లో 5.5, రంగారెడ్డి జిల్లా కందువాడలో 5.4, వనపర్తి జిల్లా ఘనపూర్‌లో 5.2, మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లెలో 5, సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 4.8, హనుమకొండ జిల్లా ఐనవోలులో 4.7, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 4.7 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో పలుచోట్ల మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. ఉప్పల్, హిమాయత్‌నగర్, బహదూర్‌పుర, కుత్బుల్లాపూర్‌లో వానపడింది. అత్యధికంగా ఉప్పల్‌లో 2.6 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. చార్మినార్ వద్ద 1.2 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్ సిటీలో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఓ మోస్తారు వాన కురిసింది. మేడిపల్లి, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మలక్‌పేట్ బ్రిడ్జి వద్ద బురద పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, సంతోష్‌నగర్‌లో ఓ మోస్తారు వాన కురిసింది. అమీర్‌పేట్, బుద్ధనగర్, మైత్రీవనం, బాల్కంపేట్ లో వరద రోడ్లపైకి వచ్చింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. పంజాగుట్ట, ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి, మాదాపూర్, మెహిదీపట్నం ప్రాంతాల్లో రోడ్లపై వర్షంపు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
