
- బీఆర్కే భవన్లో ఎన్నో సమస్యలు.. జీఏడీకి అధికారుల రిపోర్టు
- దాదాపు అన్ని ఫ్లోర్లలో అధ్వానంగా ఉన్న వాష్ రూమ్‌లు
- బిల్డింగ్ చుట్టూ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్
- తొమ్మిది ఫ్లోర్లు ఉన్నా అందులో రెండు మాత్రమే మంచిగున్నయ్
- ఇలా అయితే ఆఫీసుల షిఫ్టింగ్ తర్వాత పరిస్థితి ఏంది?
- ఆవేదన వ్యక్తం చేస్తున్న అధికారులు, ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు:బీఆర్కే భవన్లో చాలా రూమ్‌లు ఉరుస్తున్నాయని, గోడలు తడిసి తేమపట్టి పోయాయని, అలాంటి భవన్ నుంచి పరిపాలన సాగించడం చాలా కష్టమని సెక్రటేరియెట్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్, తొమ్మిదో ఫ్లోర్ తప్ప మిగతా ఫ్లోర్లన్నింటిలో అనేక సమస్యలు నెలకొన్నాయని వారు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు నివేదిక సమర్పించారు. వాష్ రూమ్‌లు కూడా సరిగ్గా లేవని, వాటర్ లీకేజీ అవుతోందని తెలిపారు. ఎన్నో రిపేర్లు చేయాల్సి ఉందని, ప్రస్తుతం ఆఫీసుల నిర్వహణకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని రిపోర్టులో పొందుపరిచారు. రాష్ట్ర సెక్రటేరియెట్‌ను కూల్చి కొత్తది కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సెక్రటేరియెట్‌లోని 80 శాతం శాఖలను పక్కనే ఉన్న బీఆర్కే భవన్‌కు, మిగితా శాఖలను ఆదర్శ్ నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి, డిపార్ట్మెంట్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో బీఆర్కే భవన్‌లోని ఆఫీసులను తరలించి భవన్‌ను ఖాళీ చేశారు. ఆ స్థానంలో సెక్రటేరియెట్‌లోని ప్రభుత్వ శాఖలను షిఫ్టు చేయాల్సి ఉంది. షిఫ్టింగ్ నేపథ్యంలో బీఆర్కే భవన్‌లోని గదులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సెక్రటేరియెట్‌లోని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు జీఏడీ సూచించింది. భవన్‌ను పరిశీలించిన అధికారులు.. రిపోర్టును అందజేశారు. తమకు కేటాయించిన ఫ్లోర్, చాంబర్లు ఎలా ఉన్నాయి.. వెంటిలేషన్, వాష్ రూమ్స్, లిఫ్ట్ లు, కరెంటు సరఫరా ఎలా ఉంది అన్న అంశాలను పరిశీలించి, సమస్యలను నివేదికలో ప్రస్తావించారు. బీఆర్కే భవన్లో 9 ఫ్లోర్లు ఉండగా.. మొదటి ఫ్లోర్, తొమ్మిదో ఫ్లోరే బాగున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు ఫ్లోర్లలో మొదటి ఫ్లోర్‌ను మంత్రుల కోసం, తొమ్మిదో ఫ్లోర్‌ను జీఏడీ, సీఎస్ ఆఫీసుల కోసం కేటాయించారు. మిగతా ఫ్లోర్లలో సరైన సౌకర్యాలు లేవని అధికారులు నివేదించారు.
ఎన్నో సమస్యలు
రానున్న రోజుల్లో కొన్నాళ్ల పాటు రాష్ట్ర పరిపాలన కేంద్రంగా ఉండనున్న బీఆర్కే భవన్ పై సెక్రటేరియెట్ ఉద్యోగులు, అధికారులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు బీఆర్కే భవన్లో సుమారు 850 ఉద్యోగులు పనిచేస్తుండే వారు. సెక్రటేరియట్ నుంచి శాఖల తరలింపు తర్వాత జీఏడీ, సీఎస్ ఆఫీసు, ఉన్నతాధికారులు, రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సందర్శకులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు ఇలా నిత్యం బీఆర్కే భవన్ రద్దీగా ఉండనుంది. విశాలమైన సెక్రటేరియెట్ నుంచి ప్రభుత్వ శాఖలు.. ఇరుకుగా ఉన్న బీఆర్కే భవన్‌కు షిఫ్టు అవుతుండటంతో చాలా సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు. పక్కనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉండటంతో వాహనాల రాకపోకల వల్ల వైబ్రేషన్ బీఆర్కే భవనంపై పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌండ్ పొల్యూషన్‌కు తోడు పక్కనే హుస్సేన్ సాగర్ నీటి దుర్వాసన, జీహెచ్ ఎంసీ సమీపంలో ఉన్న నాలా దుర్వాసన, ట్రాఫిక్ సమస్య.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియెట్ ప్రధాన రోడ్డు నుంచి లోపలికి ఉండటం, భారీగా చెట్లు ఉండటంతో డిస్ట్రబెన్స్, పొల్యూషన్ లేదని అంటున్నారు. శాఖల తరలింపు త్వరాత నిత్యం 24 గంటల పాటు కరెంటు అవసరమవుతుందని, నీటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుందని గుర్తుచేస్తున్నారు. హై స్పీడ్ ఇంటర్ నెట్ సౌకర్యంతోపాటు డేటా సెంటర్ కూడా బీఆర్కే భవన్ లో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. పక్కనే జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం ఉండటం వల్ల సందర్శకులు, నగర ప్రజలకు భద్రత పరంగా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. బీఆర్కే భవన్ చుట్టూ ఫైరింజన్ తిరిగే ప్లేస్ కూడా సరిగా లేదని, అగ్నిప్రమాదాలు జరిగితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
ఇదే పరిస్థితి ఉంటే ఎలా?
వర్షాలకు బీఆర్కే భవన్‌లోని నాలుగు, ఐదు ఫ్లోర్లలో గోడల వెంట నీళ్లు కారుతున్నాయి. మిగతా బ్లాక్ ల గోడలు కూడా తేమతో కనిపిస్తున్నాయి. నాలుగో అంతస్తులోకి రెవెన్యూ డిపార్ట్ మెంట్, విద్యాశాఖను, ఐదో అంతస్తులోకి పంచాయతీరాజ్, ఐటీ, హౌసింగ్ డిపార్ట మెంట్ ల ను తరలించాలనుకుంటున్నారు. ఈ శాఖలన్నీ కీలకమైనవి. ఆ రెండు ఫ్లోర్లు ప్రస్తుతం వర్షానికి ఉరుస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. షిఫ్టింగ్తర్వాత ఇదే పరిస్థితి ఉంటే.. సమస్యలు తప్పవని అంటున్నారు. కొత్త సెక్రటేరియెట్ నిర్మించాలంటే కనీసం రెండేండ్లయినా పడుతుందని, వర్షాలకు ఉరుస్తున్న ఈ బీఆర్కే భవన్ నుంచి విధులు ఎలా నిర్వహించాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రిపేర్లు చేశాకే సెక్రటేరియట్ లో ని శాఖల షిఫ్టింగ్ చేయాలని కోరుతున్నారు. ఇక ప్రతి ఫ్లోర్లో ఐఏఎస్ అధికారులు, గ్రూప్ స్థాయి అధికారులు కూర్చునే విధంగా మార్పులు చేయాలని నివేదికలో సూచించారు. వాష్ రూమ్ లు కూడా మంచిగాలేవని, వాటర్ లీకేజీ సమస్యల ఉందని జీఏడీ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం రూ. 90 లక్షలు నిధులు విడుదల చేసినప్పటికీ కేవలం అవి లిఫ్ట్, రెండు ఫ్లోర్లలో మరమ్మతులకే సరిపోతున్నాయని చెప్పారు. ఆఫీసులకు అనుకూలంగా ఇంకా మార్పులు చేయాల్సి ఉందని, ఇందుకోసం మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఈ రిపోర్టుపై జీఏడీ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారులు సూచించినట్లు అన్ని రిపేర్లు చేసివ్వాలంటే మరో నెల టైం పట్టే అవకాశం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.