- రేపే పోలింగ్.. పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్
- పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఈసీ
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గం సైలెంట్ అయింది. ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగియడంతో ఎన్నికల సందడి సద్దుమణిగింది. రోజూ వేలాది మంది కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన వీధులు, గల్లీలు, జంక్షన్లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్ల ఉపన్యాసాలతో హోరెత్తిన మైకులు మూగబోగా, వాహనాల కాన్వాయ్‌ల కోలాహలం కనుమరుగైంది. మంగళవారం జరగబోయే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పుడు పోలింగ్ సరళిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోల్ మేనేజ్‌మెంట్ పై దృష్టి సారించాయి. నాయకులు తమ గెలుపు అవకాశాలను పెంచుకునేందుకు వార్ రూమ్‌ల నుంచి బూత్ స్థాయి కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు మొత్తం 58 మంది పోటీ పడుతున్న ఈ ఉపఎన్నికలో.. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికలో ఇంతమంది పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2023లో జరిగిన ఎన్నికలో 19 మంది అభ్యర్థులు పోటీపడగా.. ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. అయితే, ఈ బై ఎలక్షన్ మాత్రం అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్‌గా మారింది. అధికార పార్టీగా ఇక్కడ కచ్చితంగా గెలవాలని కాంగ్రెస్, తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్, తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు పన్నుతున్నాయి.
ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు యత్నం
బహిరంగ ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు తెరవెనుక ముమ్మరంగా సాగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా పోలింగ్ రోజున ఓటర్లను బూత్‌ల వద్దకు తీసుకువచ్చే బాధ్యతతో పాటు చివరి నిమిషంలో ఓటును తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతున్నది. నియోజకవర్గంలో 4 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కుల సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలులాంటి కీలక ఓటు బ్యాంకులపై మరింత దృష్టి పెట్టి, వారిని ఆకట్టుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధాన నాయకులు, స్టార్ క్యాంపెయినర్ల పర్యటన ముగిసినప్పటికీ, ఆయా పార్టీల కిందిస్థాయి జూబ్లీహిల్స్ లోకల్ కేడర్ మాత్రం ఇంకా రంగంలోనే ఉంది. పోల్ మేనేజ్‌మెంట్ కోసం తమ శక్తియుక్తులను ఉపయోగిస్తున్నారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం, తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకురావడం, చివరి నిమిషంలో ఓటర్లు మనసు మార్చుకోకుండా చూసుకోవడంలాంటి వ్యూహాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
పార్టీల లీడర్లంతా మకాం వేసి ప్రచారం
మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనివార్యమైంది. అయినప్పటికీ, రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న తర్వాత అధికార పార్టీకి, సిట్టింగ్‌ను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌కు, సిటీలో బలపడాలని చూస్తున్న బీజేపీకి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ప్రచారం ఆరంభం నుంచే అభ్యర్థులు హోరెత్తించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించడమే కాకుండా.. గల్లీల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గల్లీలోనూ అభ్యర్థులు, వారి పక్షాన వచ్చిన ముఖ్య నేతలు ఓట్లు అభ్యర్థించారు. ప్రధాన నాయకులు ప్రసంగాలు, బహిరంగ సభలతో తమ పార్టీలకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారం మొత్తం ఒక చిన్నపాటి సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని తలపించింది.
