హైదరాబాద్, వెలుగు: గోరక్షణ పేరుతో పలువురు వ్యక్తులు, కొన్ని టీములు కబేళాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. గోరక్షకుడిగా చెప్పుకుంటున్న సోను సింగ్‌పై జరిగిన దాడి, గోరక్షక కార్యకలాపాలు దుర్వినియోగం అవుతున్న అంశాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన డీజీపీకి వినతి పత్రం సమర్పించారు. సోను సింగ్‌పై జరిగిన దాడి తీవ్రమైన ఘటన అని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
మీడియా రిపోర్టులు, స్థానిక సోర్సుల సమాచారం మేరకు ఇబ్రహీం అనే వ్యక్తి గోవుల అక్రమ రవాణా సహా పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సోను సింగ్.. ఇబ్రహీం నుంచి రూ. 5 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తున్నదన్నారు. దీంతో తలెత్తిన వివాదం కారణంగానే ఇబ్రహీం, అతని అనుచరులు సోను సింగ్‌పై దాడికి పాల్పడినట్లు రాజా సింగ్ ఆరోపించారు.
