రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే తన ప్రభుత్వాన్ని కాపాడేందుకు సహకరించారని అన్నారు. 2020లో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే వ్యవహారంపై మాట్లాడిన గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
.
ధనబలం ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రమంత్రులైన అమిత్ షా, గజేంద్ర షేకావత్, ధర్మేంద్ర ప్రధాన్‌లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపించారని, అయితే ఇద్దరు బీజేపీ నాయకులతో పాటు వసుంధర రాజే వారికి మద్ధతు ఇవ్వకుండా తన ప్రభుత్వాన్ని కాపాడినట్లుగా ఆయన పేర్కొన్నారు.
అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వసుంధర రాజే ఎదురుదాడి చేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టే సంప్రదాయం తమకు లేదన్నారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే గెహ్లాట్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. తనపై ప్రశంసలు కురిపించడం పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన సొంత పార్టీలోనే తిరుగుబాటు జరుగుతున్నందు వల్లే గెహ్లాట్ ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపారు.
