- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రైల్వే బోర్డ్ చైర్మన్, ఆర్పీఎఫ్ డీజీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
జైపూర్: రాజస్తాన్‌లో కదులుతున్న రైలులో దారుణం జరిగింది. బ్లాంకెట్, బెడ్‌షీట్ అడిగాడని సోల్జర్ తో గొడవ పడ్డ రైల్వే ఉద్యోగి, సోల్జర్ను కత్తితో పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఇష్యూపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. రైల్వే బోర్డ్ చైర్మన్, ఆర్పీఎఫ్ డీజీలకు నోటీసులు జారీ చేసింది. గుజరాత్‌లోని సబర్మతికి చెందిన జిగర్ చౌధరి ఆర్మీలో సోల్జర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
లీవ్ తీసుకుని ఈ నెల 2న ఇంటికి బయలుదేరాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ స్టేషన్ వద్ద జమ్మూ తావి–సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఏసీ స్లీపర్ కోచ్‌లో కూర్చున్నాడు. ట్రైన్ రాజస్తాన్‌లోని బికనీర్ జిల్లాలోకి ఎంటర్ అవగానే చీకటి పడింది. బాగా చలి వేస్తుండటంతో జిగర్ చౌదరి.. బ్లాంకెట్, బెడ్‌షీట్ ఇవ్వమని తన ఏసీ కోచ్ అటెండెంట్ జుబైర్ మెమన్ను రిక్వెస్ట్ చేశాడు. అతను బెడ్‌షీట్ మాత్రమే ఇచ్చాడు. బ్లాంకెట్ ఇవ్వకపోవడంతో జిగర్ చౌధరి, జుబైర్ మెమన్ మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో సైనికుడిని కోచ్ అటెండెంట్ తన వద్ద ఉన్న కత్తితో పొడిచేశాడు. దీంతో జవాన్ అక్కడికక్కడే మృతిచెందాడు.
కాంట్రాక్టర్ ద్వారా నియామకం
రైలు బికనీర్ స్టేషన్‌కు చెరుకున్న తర్వాత టీటీఈ ఫిర్యాదు ఆధారంగా రైల్వే పోలీసులు జుబైర్ మెమన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. జుబైర్‌ను కాంట్రాక్టర్ ద్వారా నియమించుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఘటనపై సహ్యద్రి రైట్స్ ఫోరమ్ అనే ఎన్జీఓ ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. రైల్వే బోర్డ్ చైర్మన్, ఆర్పీఎఫ్ డీజీలకు నోటీసులు జారీచేసింది. ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీలోని ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని బెంచ్ కేసును విచారించింది. ఈ దారుణంపై ఏం చర్యలు తీసుకున్నారో రెండు వారాల్లోగా నివేదికను సమర్పించాలని రైల్వే బోర్డు, ఆర్పీఎఫ్ లకు ఆదేశించింది.
