రాజస్తాన్‌‌‌‌ బికనీర్‌‌‌‌ లో ఇసుక తుఫాను బీభత్సం.. పట్టపగలే చీకట్లు, స్తంభించిన జనజీవనం

రాజస్తాన్‌‌‌‌ బికనీర్‌‌‌‌ లో ఇసుక తుఫాను బీభత్సం.. పట్టపగలే చీకట్లు, స్తంభించిన జనజీవనం

బికనీర్: రాజస్తాన్‌‌‌‌లోని బికనీర్‌‌‌‌లో శనివారం మధ్యాహ్నం ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. దట్టమైన ఇసుక మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో పట్టణమంతా పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి. భారీ ఇసుక గోడలా దూసుకొస్తున్న తుఫాను దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్‌‌‌‌గా మారాయి. నగరంలో పసుపు, గోధుమ రంగుతో కూడిన వింత వాతావరణం ఏర్పడింది.

 వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈదురు గాలుల ఉధృతి పెరగడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. వ్యాపారులు షాపుల షట్టర్లు మూసేయడంతో మార్కెట్లలో గందరగోళం నెలకొంది. పాదాచారులు తలదాచుకునేందుకు పరుగులు తీశారు. బలమైన గాలుల ధాటికి నగరంలో జనజీవనం స్తంభించింది. 

ఈదురు గాలుల తాకిడికి చెట్ల కొమ్మలు విరిగిపడడంతో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, బికనీర్, జైపూర్, అజ్మీర్, భరత్ పూర్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.