
హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ వేగంగా వ్యాపిస్తోంది. వీకెండ్స్ లో ఏ పబ్ చూసినా.. ఫామ్ హౌస్ చూసినా డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్న యువత కనిపిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నప్పటికీ డ్రగ్స్ మహమ్మారి అంతం కావట్లేదు. డ్రగ్స్ పట్ల యువతకు ఉన్న బలహీనతను క్యాష్ చేసుకునేందుకు కొందరు ఫామ్ హౌస్ యజమానులు ఇంస్టాగ్రాం వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ను వాడుకుంటున్నారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొయినాబాద్ లోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో 50 మంది ఇంటర్ స్టూడెంట్స్ పాల్గొన్న డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నవారంతా ఇంటర్ స్టూడెంట్స్ కావడం సంచలనం రేపుతోంది. పార్టీలో పాల్గొన్నవారంతా 15, 17 ఏళ్ళ మైనర్ స్టూడెంట్స్ అని.. మొత్తం 50 మంది పార్టీలో పాల్గొన్నట్లు తెలిపారు పోలీసులు. పార్టీలో డ్రగ్స్, మద్యం భారీగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
పార్టీ నిర్వాహకులు కిషన్ తో పాటు మరొక ఐదు మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.ఇంస్టాగ్రామ్ లో ట్రాప్ హౌస్ పేరుతో ఐడి క్రియేట్ చేసి... డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసం ఆన్లైన్ ద్వారా ఒక్కొక్కరి నుంచి రూ. 1300 వసూలు చేసినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.
డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ యువతీ యువకులు గచ్చిబౌలి, మాదాపూర్, నార్సింగ్, కెపిహెచ్పి, కూకట్పల్లి, ప్రాంతాలకు చెందినట్టుగా గుర్తించారు పోలీసులు. వీరిలో 14 మంది యువతులు, 35 మంది యువకులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. పట్టుబడ్డవారిలో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది.ఫామ్ హౌస్ లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా 8 బాటిల్లు మద్యాన్ని, డీజే ను సీజ్ చేశారు పోలీసులు.