రాజేంద్ర నగర్ లో ఐటీ ఐబ్

రాజేంద్ర నగర్ లో ఐటీ ఐబ్

హైదరాబాద్, వెలుగు: ఎయిర్ పోర్టుకు దగ్గరగా మరో ఐటీ క్లస్టర్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. గతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ ఐటీ కారిడార్​లోనే హెచ్ఎండీఏకు చెందిన ల్యాండ్ బ్యాంక్​ లో ఐటీ హబ్ రానుంది. ఇంటర్నేషనల్ లెవల్ లో నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించనున్నారు. తాజాగా డిజైన్ల రూపకల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు.  ఐటీ హబ్​లో ఆఫీస్ స్పేస్, కన్వెన్షన్ హాల్స్, రెస్టారెంట్లతో బోర్డింగ్ కోసం హోటల్ తరహా నిర్మాణాలు 
రానున్నాయి.  రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ లోని హెచ్ఎండీఏకు 165 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ లో 105 ఎకరాలు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత ఐటీ కారిడార్​లో లోడ్ తగ్గించేలా, శంషాబాద్​ ఎయిర్ పోర్టుకు చేరువగా కమర్షియల్ యాక్టివిటీని మరింత ప్రోత్సాహించేలా ఐటీ క్లస్టర్ సిద్ధం చేయాలనే ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో హెచ్ఎండీఏ ప్లాన్ అమలు చేయనుంది. 

ఆర్కిటెక్ట్  సంస్థల నుంచి డిజైన్లు..  
దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఐటీ క్లస్టర్ కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి హెచ్ఎండీఏ డిజైన్లను ఆహ్వానించింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేపట్టడానికి నిర్మాణ డిజైన్లను ఈ సంస్థల నుంచి స్వీకరించనుంది. అత్యుత్తమ డిజైన్లను ఎంపిక చేసి, ప్రభుత్వం ఆమోదంతో పనులు చేపట్టనున్నట్లుగా అధికారులు తెలిపారు.  ఈ ఐటీ క్లస్టర్​తో బుద్వేల్ పరిసర ప్రాంతాల్లోని 250 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమికి భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో కోకాపేట తరహా ల్యాండ్ వేలం నిర్వహించాలనే భవిష్యత్ ప్రణాళికలతో బుద్వేల్ ఐటీ క్లస్టర్ తెరమీదకు వచ్చినట్లు సమాచారం. గతంలో ఇక్కడ ఐటీ కారిడార్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేసి విరమించుకున్న సంగతి తెలిసిందే.

భూములను పరిశీలించిన ఉన్నతాధికారులు
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు ఇటీవల బుద్వేల్​లోని భూములను పరిశీలించారు.  దాదాపు 5-8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్, రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్, మోడ్రన్ కన్వెన్షన్ సెంటర్లు, కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ హాల్స్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. డిజైన్లకు అనుమతులు వచ్చిన మూడేళ్లలో పనులు పూర్తవుతాయంటున్నారు.  దీంతో పాటు 200 స్టార్టప్​లకు వర్క్ స్టేషన్ ఫెసిలిటీ, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లు నిర్వహించుకునేందుకు వీలుగా నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపారు. డిజైన్లకు మరో వారం రోజులే ఉండగా.. డిసెంబర్ రెండో వారంలోగా పనులు, డిజైన్లను అందించే సంస్థల ఎంపిక పూర్తి కానుంది.