గోవా నుంచి హైదరాబాద్ సిటీకి డ్రగ్స్

గోవా నుంచి హైదరాబాద్ సిటీకి డ్రగ్స్
  •     ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  •     రూ. లక్ష విలువైన 11 గ్రాముల ఎండీఎంఏ సీజ్ 

షాద్​నగర్, వెలుగు: గోవా నుంచి సిటీకి డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని రాజేంద్రనగర్ ఎస్​వోటీ, శంషాబాద్, షాద్​నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం షాద్​నగర్ పీఎస్​లో ఏర్పాటు చేసిన సమవేశంలో ఏసీపీ రామస్వామి వివరాలు వెల్లడించారు. గురువారం రాత్రి 8 గంటలకు రాయికల్ టోల్ ప్లాజా వద్ద రాజేంద్రనగర్ ఎస్​వోటీ ఎస్సైలు రమణారెడ్డి, రాజశేఖర్, శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ రషీద్, షాద్ నగర్ ఇన్ స్పెక్టర్ ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

ఓ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేసి కె. ప్రియాంక రెడ్డి అలియాస్ ప్రియ(29), ఎం. శ్రీతేజ(29) అనే ఇద్దరు ప్యాసింజర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని ఏసీపీ రామస్వామి తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా నుంచి సిటీకి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారన్నారు. 

నిందితులకు డ్రగ్స్​ను అందించిన గోవాలో ఉండే రష్యన్ మహిళ అన్నాపై సైతం కేసు నమోదు చేశామన్నారు. ఈ డ్రగ్స్ దందాలో గోవాకు చెందిన శివ, భరత్ కుమార్ ఉన్నట్లు  గుర్తించామన్నారు. ప్రియాంక, శ్రీతేజను అరెస్ట్ చేసి రిమాండ్​​కు తరలించామన్నారు.