వెల్లూరు జైలు నుంచి విడుదలైన నళిని

వెల్లూరు జైలు నుంచి విడుదలైన నళిని

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలైన నళిని శ్రీహరన్ తమిళనాడులోని వెల్లూరు జైలు నుంచి విడుదలైంది. మిగతా నిందితులు కూడా జైలు విడుదల కానున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 31ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవిస్తున్న నిందితులను విడుదల చేయాలంటూ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నళిని శ్రీహరన్ ఈరోజు వెల్లూరు జైలు నుంచి రిలీజైంది.

త్వరలోనే మిగతా నిందితులు జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్ర రాజా, శ్రీహరన్ కూడా విడుదల కానున్నారు. నిందితులు జైలులో మంచి నడవడికతో ఉన్నారని, జైలులో ఉన్న సమయంలో వివిధ డిగ్రీలు పూర్తి చేశారని కోర్టు తెలిపింది. గతంలో ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పెరారివాలన్ కు నిర్దేశించిన గైడ్ లైన్సే మిగిలిన దోషులకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది.  2022 మే 18న పెరరివాలన్ ను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును మిగిలిన దోషులకు కూడా  సుప్రీంకోర్టు వర్తింపజేసింది.  

అటు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఆ పార్టీ  సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు దేశ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించకపోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.