- డిప్యూటీ సీఎం హామీతో చిగురించిన ఆశలు
- జిల్లాలో లక్షన్నర అప్లికేషన్లు
- ఫైల్ ఎక్కడి వరకు వచ్చిందని దరఖాస్తుదారుల ఆరా
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజీవ్ యువ వికాసం స్కీం కోసం దాదాపు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిప్యూటీ సీఎం హామీతో ఆశలు చిగురించాయి. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ ఏడాది నవంబర్‌లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో హైదరాబాద్కలెక్టరేట్కు దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. జిల్లాలో 1,31,548 అప్లికేషన్లు రాగా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 67,321, బీసీ, ఈబీసీ కార్పొరేషన్లకు 34,719, ఎస్సీ కార్పొరేషన్‌కు 26,260, ఎస్టీ కార్పొరేషన్‌కు 3,248 వచ్చాయి.
ప్రభుత్వ తాజా ప్రకటనతో దరఖాస్తుదారులు కలెక్టరేట్‌కు వచ్చి తమ అప్లికేషన్ ఏ దశలో ఉందని అడిగి తెలుసుకుంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం గతంలోనే మండల కన్వీనర్‌గా తహసీల్దార్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన ఆరుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. అయితే, తుది ఎంపిక ప్రక్రియ, లబ్ధిదారుల జాబితా, ఆర్థిక సాయం అందించే కచ్చితమైన తేదీలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. నిరుద్యోగ యువతతో పాటు కుటుంబ పోషణకు ఆధారం లేని 55 ఏండ్లలోపు వ్యక్తులకు రాజీవ్‌యువ వికాసం కింద స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
