
భుజ్ ఎయిర్ బేస్ ను సందర్శించిన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ తో ట్రైలర్ మాత్రమే చూపించమని.. ఇకనైనా పాకిస్తాన్ మారకపోతే పూర్తి సినిమా చూపిస్తామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తో మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని అన్నారు రాజ్ నాథ్ సింగ్. ఆపరేషన్ సిందూర్ ను ప్రపంచం మొత్తం వీక్షించిందని అన్నారు. 1965లో భారత్ విజయానికి భుజ్ ఎయిర్ బేస్ కారణమని అన్నారు. మన బ్రహ్మోస్ శక్తికి పాకిస్థాన్ తలవంచిందని అన్నారు. మన భారత వెపన్స్ అన్ స్టాపబుల్ అని అన్నారు రాజ్ నాథ్ సింగ్.
జైషే, లష్కర్ టెర్రరిస్టులకు పాక్ స్పాన్సర్ చేస్తోందని.. ఉగ్రవాదానికి పాక్ నిధులు ఇస్తోందని అన్నారు. ఉగ్రవాదులకు పాక్ సాయం చేస్తూ ప్రపంచానికి ముప్పు తెస్తోందని అన్నారు రాజ్ నాథ్ సింగ్. పాక్ కు ఆర్థిక సాయంపై IMF మరోసారి ఆలోచించాలని అన్నారు. పాకిస్థాన్ కు ఆర్థికసాయం చేస్తే.. ఉగ్రవాదులకు చేసినట్లే అని అన్నారు. పాకిస్థాన్ లోని ఏ ప్రాంతంపై అయినా దాడి చేసే సామర్థ్యం భారత్ కు ఉందని అన్నారు.
పాక్ పై భారత్ విజయానికి భుజ్ ఎయిర్ బేస్ ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని.. సరిహద్దు దాటకుండానే పాక్ ఉగ్రస్థావరాలను కూల్చేశామని అన్నారు. పాకిస్థాన్ టెర్రర్ ముఖ్య కేంద్రాన్ని భారత్ ధ్వంసం చేసిందని అన్నారు రాజ్ నాథ్ సింగ్. ఇదిలా ఉండగా.. గురువారం ( మే 15 ) పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం ఒక రోగ్ కంట్రీ అని.. అలాంటి దేశం వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఎంత వరకు సేఫ్ అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
పాక్ దగ్గర ఉన్న అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షించాలని సూచించారు. ఆపరేషన్ ‘సిందూర్’ తర్వాత జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న ఆర్మీ 15 కోర్ ప్రధాన కార్యాలయాన్ని రాజ్ నాథ్ గురువారం సందర్శించారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్మీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. భద్రతా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల వద్ద నెలకొన్న పరిస్థితుల గురించి ఆరా తీశారు. బార్డర్ ఏరియాల్లో పాకిస్తాన్ షెల్లింగ్ పై అడిగి తెలుసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్ లో ముష్కరులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ఈ సందర్భంగా రాజ్ నాథ్ నివాళులర్పించారు. అలాగే, పహల్గాంలో టెర్రరిస్టుల చేతిలో చనిపోయిన టూరిస్టులకు కూడా ఆయన అంజలి ఘటించారు. టెర్రరిస్టులతో పోరాడుతూ గాయపడిన సోల్జర్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.