కొత్త ఆలోచనలకు పదును పెట్టండి : రాజ్ నాథ్ సింగ్

కొత్త ఆలోచనలకు  పదును పెట్టండి :   రాజ్ నాథ్ సింగ్
  • దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పరేడ్
  • శిక్షణ పూర్తి చేసిన 213 మంది ఫ్లయింగ్ ఆఫీసర్స్

హైదరాబాద్, వెలుగు:  దేశ రక్షణలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశేష సేవలు అందిస్తున్నదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సాయుధ దళాల్లో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే.. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆదివారం ఫ్లయింగ్ క్యాడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. ఈ పరేడ్ కు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 25 మంది మహిళలు సహా 213 ఫ్లైట్ క్యాడెట్‌‌‌‌లు పరేడ్ నిర్వహించారు. గౌరవ వందనం అనంతరం రాజ్ నాథ్ సింగ్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. 

ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. యువత ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అన్నారు. ఎయిర్ ఫోర్స్ లో యువ అధికారులు తమలోని నూతనత్వాన్ని, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని సూచించారు. వాయుసేన అధికారులుగా ఆకాశంలో ఎగురుతూ ఉండాలి, ఎక్కువ ఎత్తులను తాకాలి కానీ నేలతో  సంబంధాన్ని కొనసాగించాలని అన్నారు. భారత వాయుసేనకు చెందిన అధికారులతో పాటు భారత నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి తొమ్మిది మంది, వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు సైతం ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి రక్షణశాఖ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ నుంచి అవార్డులను పొందారు. శిక్షణలో టాపర్‌‌‌‌గా నిలిచిన ఫ్లయింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ అతుల్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌ రాష్ట్రపతి ఫలకం, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వార్డ్ ఆఫ్ హానర్‌‌‌‌ను రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ చేతులమీదుగా అందుకున్నారు.

పేదకుటుంబం నుంచి ఫ్లయింగ్ ఆఫీసర్ 

శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్స్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మంది యువకులు ఉన్నారు. ఇందులో వికారాబాద్ జిల్లా చీమల్ దారికి చెందిన ఎరువ శేఖర్ కుమారుడు సూర్యకిరణ్ ఫ్లయింగ్ ఆఫీసర్ గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. పేదరికంలో పుట్టిపెరిగిన శేఖర్ కు దేశభక్తి ఎక్కువ. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ యుద్ధ విమానాలు ప్రదర్శించిన నైపుణ్యం స్ఫూర్తితో తన కుమారుడి పేరును కూడా సూర్యకిరణ్ గా పెట్టాడు. ఆర్మీ లేదా ఎయిర్ ఫోర్స్ లో చేర్చాలనే ఉద్దేశంతో సూర్యకిరణ్​కు చదివించాడు. కూతురు హారిక కూడా పోలీస్ అకాడమీలో ఎస్ఐగా ట్రైనింగ్ పొందుతున్నది.

ఆకట్టుకున్న ఎయిర్ షో

ఫ్లయింగ్ క్యాడెట్లు నిర్వహించిన పరేడ్‌‌‌‌ ఆకట్టుకుంది. అనంతరం భారత వాయుసేనకు చెందిన అధికారులు గగనతలంలో ప్రదర్శించిన వైమానిక ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సారంగ్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌ బృందం, సూర్యకిరణ్‌‌‌‌ ఏరోబాటిక్‌‌‌‌ బృంద విన్యాసాలు, సుఖోయ్‌‌‌‌-30 ఎంకేఐ ఆకాశంలో నిర్వహించిన ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్‌‌‌‌ ఆఫీసర్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు.