
- ఆ రోగ్ కంట్రీ అణ్వస్త్రాలను ఐఏఈఏ పర్యవేక్షించాలని పిలుపు
- పాక్ ఎక్కడుంటే అక్కడ్నే ‘బిచ్చగాళ్ల లైన్’ ప్రారంభం అవుతుందని ఎద్దేవా
- శ్రీనగర్‌లో ఆర్మీ 15 కోర్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించిన రక్షణ మంత్రి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం ఒక రోగ్ కంట్రీ అని.. అలాంటి దేశం వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఎంత వరకు సేఫ్ అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షించాలని సూచించారు. ఆపరేషన్ ‘సిందూర్’ తర్వాత జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న ఆర్మీ 15 కోర్ ప్రధాన కార్యాలయాన్ని రాజ్ నాథ్ గురువారం సందర్శించారు.
జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్మీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. భద్రతా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల వద్ద నెలకొన్న పరిస్థితుల గురించి ఆరా తీశారు. బార్డర్ ఏరియాల్లో పాకిస్తాన్ షెల్లింగ్ పై అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ లో ముష్కరులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ఈ సందర్భంగా రాజ్ నాథ్ నివాళులర్పించారు. అలాగే, పహల్గాంలో టెర్రరిస్టుల చేతిలో చనిపోయిన టూరిస్టులకు కూడా ఆయన అంజలి ఘటించారు. టెర్రరిస్టులతో పోరాడుతూ గాయపడిన సోల్జర్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
ఉగ్రవాద అంతానికి ఏమైనా చేస్తాం
టెర్రరిజంపై తాము చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అతిపెద్దదని రాజ్ నాథ్ చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏమైనా చేస్తామని, ఎంత దూరమైనా వెళతామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ తో భారత బలం ఏంటో ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడాన్ని ఇప్పటికైనా పాకిస్తాన్ మానుకోవాలని హితవు పలికారు. ‘‘మన ఆర్మీ టార్గెట్ అత్యంత కచ్చితంగా ఉన్న విషయం ప్రపంచానికి తెలుసు.
టార్గెట్లను మాత్రమే మనం ధ్వంసం చేశాం. ఈరోజు ఉగ్రవాదంపై ఇండియా ప్రతిజ్ఞ ఏంటో ప్రపంచమంతా చూస్తున్నది. తమ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని పాక్ బెదిరిస్తున్నా మేము లెక్కచేయడం లేదు. పాక్ బెదిరింపులు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో ప్రపంచం మొత్తం చూస్తున్నది. అలాంటి బాధ్యతలేని దేశం వద్ద అణ్వాయుధాలు ఉండడం ఎంత వరకు కరెక్టు? వారి వద్ద ఉన్న అణ్వాయుధాలను ఐఏఈఏ పర్యవేక్షించాలి” అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.
రాజ్ నాథ్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నరు: పాక్
పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసిన రాజ్ నాథ్ వ్యాఖ్యలపై శత్రుదేశం స్పందించింది. రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు బాధతారహితంగా ఉన్నాయని, ఫ్రస్ట్రేషన్ లో ఆయన మాట్లాడినట్లు కనిపిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ ప్రతినిధి షఫ్ ఖత్ అలీ ఖాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పాక్ ఉన్న చోటు నుంచే ‘లైన్ ఆఫ్ బెగ్గర్స్’ స్టార్ట్
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గత కొన్నేండ్లుగా దుర్భరంగా తయారైందని, ఇంకా బయటి దేశాలు, సంస్థలపైనే ఆధారపడుతున్నదని రాజ్ నాథ్ ఎద్దేవా చేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి ఇటీవలే అప్పులు తీసుకోవడమే అందుకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. ‘‘అడుక్కోవడమే పాకిస్తాన్ పని అయిపోయింది. మన శత్రు దేశం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందంటే పాక్ సైనికులు ఉన్న చోటు నుంచే ‘లైన్ ఆఫ్ బెగ్గర్స్’ ప్రారంభం అవుతుంది” అని రాజ్ నాథ్ పేర్కొన్నారు.