రావల్పిండిలోనూ మన సైన్యం​ గర్జన పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నం: రాజ్​నాథ్ ​సింగ్​

రావల్పిండిలోనూ మన సైన్యం​ గర్జన పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నం: రాజ్​నాథ్ ​సింగ్​
  • ఉగ్రవాదంపై పోరులో సత్తా చాటాం
  • మనం ఎక్కడా ప్రజలను టార్గెట్ చేయలే
  • పాక్​ మాత్రం అమాయకులనే టార్గెట్ చేసింది
  • మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది
  • ఇది నయా భారత్.. టెర్రరిజాన్ని సహించదు
  • ‘ఆపరేషన్ ​సిందూర్’​ దేశ సంకల్ప శక్తికి చిహ్నం
  • బ్రహ్మోస్​ మన శత్రువులకు ఒక సందేశం
  • యూపీలో బ్రహ్మోస్  మిసైల్ ​ప్రొడక్షన్​ యూనిట్​ ప్రారంభం

న్యూఢిల్లీ: ఆపరేషన్​ సిందూర్ లో భాగంగా ఇండియన్​ ఆర్మీ తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, సరిహద్దుల వెంబడే కాదు.. సరిహద్దు దాటి పాకిస్తాన్​లోని రావల్పిండిలోనూ గర్జించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ వ్యాఖ్యానించారు. ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌’ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నమని పేర్కొన్నారు. టెర్రరిజంపై పోరులో మనదేశ సత్తా ఏంటో చూపించామని, ఉగ్రవాదులు, వారిని పెంచి పోషిస్తున్నవారు ఎక్కడున్నా వెంటాడి వేటాడుతామని నిరూపించామని చెప్పారు.

 ఆదివారం ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాజధాని లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌‌‌‌‌‌‌‌లో బ్రహ్మోస్ సూపర్‌‌‌‌‌‌‌‌సోనిక్ క్రూయిజ్ మిసైల్​ ప్రొడక్షన్ యూనిట్‌‌‌‌‌‌‌‌ను రాజ్​నాథ్​సింగ్​వర్చువల్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్​ సిందూర్.. ఉగ్రవాదంపై పోరులో మన దేశ దృఢ సంకల్పంతోపాటు మన ఆర్మీ శక్తి సామర్థ్యాలను చాటిచెప్పిందన్నారు. 

పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందని తెలిపారు. భారత సైన్యం పాక్​ప్రజలకు హాని కలగకుండా టెర్రరిస్టు క్యాంపులపై దాడి చేయగా, పాకిస్తాన్​ మాత్రం భారత్​లోని అమాయక పౌరులు, ప్రార్థనా స్థలాలనే ప్రత్యేకంగా టార్గెట్​ చేసిందని ఆరోపించారు. ఈ ఆపరేషన్​ విజయవంతం కావడంతో ఇండియన్​ మిలిటరీకి యావత్తు దేశం అభినందనలు తెలిపిందన్నారు. భారత్​లో ఉగ్రదాడికి పాల్పడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. ఇది నయా భారత్​ అని.. టెర్రరిజాన్ని సహించబోదని తెలిపారు. 

బ్రహ్మోస్​.. మన సైన్యం శక్తికి నిదర్శనం

బ్రహ్మోస్​ అంటే ఒక క్షిపణి మాత్రమే కాదని.. మన సైన్యం శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. మేం నిరంతరం మా బలాన్ని పెంచుకుంటున్నాం. ఈ రోజు ప్రారంభిస్తున్న బ్రహ్మోస్​ క్షిపణి ప్రొడక్షన్​ యూనిట్​మన దేశ ఆయుధ శక్తిని మరింత బలోపేతం చేయడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నా” అని పేర్కొన్నారు.  బ్రహ్మోస్​.. ప్రపంచంలోనే అతి వేగవంతమైన సూపర్​సోనిక్​ క్రూయిజ్​మిసైల్​అని తెలిపారు. ‘‘ఇది ఒక ఆయుధం మాత్రమే కాదు.. శత్రువులకు ఒక సందేశం..మన సాయుధ బలగాల సామర్థ్యానికి సంకేతం..మన సరిహద్దులను కాపాడుకోవడంలో మన నిబద్ధతకు నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.  

బ్రహ్మోస్ మిసైల్​ద్వారా భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని, శత్రువులకు తమ శక్తిని తెలియజేసిందని చెప్పారు. ప్రత్యేక కారణాల వల్ల ఈరోజు తాను లక్నో రాలేకపోయానని, పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన రోజునే లక్నో యూనిట్ ప్రారంభం కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. లక్నోలో దేశంలోనే అతిపెద్ద బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ యూనిట్​ను 40 నెలల్లోనే  సిద్ధం చేసిన వారికి అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ యూనిట్ నిర్మాణంలో సహకరించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సిబ్బందిని ప్రశంసించారు.  

ఏటా 100–150నెక్స్ట్ జనరేషన్‌‌‌‌‌‌‌‌ బ్రహ్మోస్ మిసైల్స్​

లక్నోలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ నుంచి ఏటా 100 బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేయనున్నారు. అలాగే అదనంగా 100 నుంచి 150 నెక్ట్స్‌‌‌‌‌‌‌‌ జనరేషన్‌‌‌‌‌‌‌‌ బ్రహ్మోస్ మిసైల్స్​ను కూడా తయారు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీన్ని బ్రహ్మోస్​ ఏరోస్పేస్, డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్​పీఓ మాషినోస్ట్రోయేనియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో 290–400 కిలోమీటర్ల రేంజ్​లో 208 మ్యాక్​ (3,430 కేఎంపీహెచ్​) స్పీడ్​తో గాలిలో దూసుకుపోయే మిసైల్స్​ను తయారు చేస్తారు. 

ప్రస్తుత బ్రహ్మోస్ మిసైల్​ 2,900 కేజీల బరువు ఉండగా.. కొత్త క్షిపణుల బరువు 1,290 కిలోగ్రాములు మాత్రమే ఉంటుంది. ఇప్పటివరకు, సుఖోయ్ వంటి యుద్ధ విమానాలు ఒకే ఒక బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లగలిగితే.. ఇప్పుడు మూడు నెక్ట్స్‌‌‌‌‌‌‌‌ జనరేషన్‌‌‌‌‌‌‌‌ బ్రహ్మోస్ మిసైల్స్​ను మోసుకెళ్లగలవు. యూపీ సర్కారు ఉచితంగా అందించిన 80 హెక్టార్ల స్థలంలో రూ.300 కోట్ల వ్యయంతో ఈ క్షిపణి ఉత్పత్తి యూనిట్​ను నిర్మించారు. 2018 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్​ సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఈ  యూనిట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు.