కోస్తాను కెలికితే ఖతమే: రాజ్ నాథ్

కోస్తాను కెలికితే ఖతమే: రాజ్ నాథ్

ఉగ్రవాద మూకలు కోస్తా తీరాన్ని టార్గెట్ చేస్తే అందుకు తగినట్టుగా బదులిస్తామని చెప్పారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. కేరళలోని కొల్లాంలో మాతా అమృతానందమయి 66వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

కచ్ నుంచి… కేరళ వరకు… తీర ప్రాంత రక్షణకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని చెప్పారు రాజ్ నాథ్ సింగ్. “సీమాంతర ఉగ్రవాదులు సముద్ర తీరం వెంబడి చేసే దాడులను మేం ఏ మాత్రం సహించం. పాకిస్థాన్ ప్రేరేపేత ఉగ్రవాదులు భారత సముద్ర తీర ప్రాంతాలపై కన్నేసినట్టు సమాచారం ఉంది. అందుకే.. తీర ప్రాంత గస్తీని మరింత కట్టుదిట్టం చేస్తున్నాం. పుల్వామా ఉగ్ర దాడి తర్వాత.. భారత సైన్యం చేసిన ఎయిర్ స్ట్రైక్ అందరం చూశాం. మనం ఏ దేశం జోలికి పోం. మన జోలికి ఎవరైనా వస్తే మాత్రం వారిని వదిలిపెట్టం. మనకు నిద్ర లేకుండా చేసిన దేశాన్ని.. శాశ్వత నిద్రలోకి పంపివ్వడం మాత్రం ఖాయం” అని రాజ్ నాథ్ చెప్పారు.