సముద్రపు దొంగలకు ఇండియా వార్నింగ్

సముద్రపు దొంగలకు ఇండియా వార్నింగ్
  • వాణిజ్య నౌకలపై దాడి విషయంలో రాజ్​నాథ్​
  •     ‘ఐఎన్ఎస్ ఇంఫాల్’ ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్  
  •     హిందూ మహాసముద్రంలో సెక్యూరిటీ బాధ్యత ఇండియాదే

ముంబై : అరేబియా సముద్రంలో, ఎర్ర సముద్రం ద్వారా ఇటీవల ఇండియాకు వస్తున్న రెండు వాణిజ్య నౌకలపై దాడి చేసినోళ్లను పట్టుకుని కఠినంగా శిక్షించి తీరుతామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. వాళ్లు సముద్రం అడుగున దాక్కున్నా కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇండియాకు వస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై అరేబియా సముద్రంలో, మరో వాణిజ్య నౌక ఎంవీ సాయిబాబాపై ఎర్ర సముద్రంలో శనివారం జరిగిన డ్రోన్ దాడులను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ముంబైలో భారత స్వదేశీ, అధునాతన యుద్ధనౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ ను ప్రారంభించిన అనంతరం రాజ్ నాథ్ మాట్లాడారు. వాణిజ్య నౌకలపై దాడుల తర్వాత అరేబియన్ సీ, హిందూ మహాసముద్రంలో గస్తీని పెంచామన్నారు. అరేబియన్, హిందూ మహాసముద్రాల్లో సెక్యూరిటీ బాధ్యతను ఇండియా తీసుకుంటుందన్నారు. ప్రాంతీయంగా సముద్ర భద్రతకు భారత ప్రభుత్వం మిత్ర దేశాలతో కలిసి పని చేస్తుందని తెలిపారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ మాట్లాడుతూ.. వాణిజ్య నౌకలపై దాడులను అరికట్టేందుకు పీ8ఐ, డోర్నియర్ విమానాలను, హెలికాప్టర్లను, కోస్ట్ గార్డ్ షిప్ లను కంబైన్డ్ గా రంగంలోకి దింపామని వెల్లడించారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి, నేవీ చీఫ్ తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, నేవీ ఆఫీసర్లు పాల్గొన్నారు.     

విశాఖపట్నం క్లాస్​లో మూడోది.. 

అధునాతన విశాఖపట్నం క్లాస్ (ప్రాజెక్ట్ 15బీ) స్వదేశీ స్టెల్త్ డిస్ట్రాయర్ రకం నౌకలను నాలుగింటిని ఇండియన్ నేవీ సమకూర్చుకుంటుండగా, వీటిలో ఐఎన్ఎస్ ఇంఫాల్ మూడోది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్, బ్రిటిష్ సైన్యానికి మధ్య జరిగిన ఇంఫాల్ యుద్ధంలో పోరాడిన ఇండియన్ సోల్జర్లకు గుర్తుగా దీనికి నామకరణం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఓ సిటీ పేరును నేవీ యుద్ధనౌకకు పెట్టడం ఇదే తొలిసారి. ఐఎన్ఎస్ ఇంఫాల్​ను ముంబైలోని రక్షణ రంగ సంస్థ మాజగాన్ డాక్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. అక్టోబర్ 20న దీనిని నేవీకి అందించింది. అప్పటినుంచి బ్రహ్మోస్ మిసైల్ సహా అనేక పరీక్షల్లో ఇది సత్తా చాటింది. పూర్తిస్థాయిలో సిద్ధమైన నౌకను మంగళవారం అధికారికంగా నేవీలో విధుల్లోకి తీసుకున్నారు. ఐఎన్ఎస్ ఇంఫాల్ 163 మీటర్ల పొడవు, 7,400 టన్నుల బరువు ఉంటుంది. గంటకు గరిష్టంగా 56 కిలోమీటర్ల స్పీడ్ తో ఇది ప్రయాణించగలదు. అధునాతన రాడార్, మిసైల్స్, గన్స్ వంటివి ఉన్న ఐన్ఎస్ ఇంఫాల్ తో నేవీ మరింత బలోపేతం కానుంది.

అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలతో గస్తీ 

నౌకలపై దాడుల నేపథ్యంలో అరేబియన్ సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించినట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. ఐఎన్ఎస్ మార్ముగావ్, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్​కతా షిప్పులతో పాటు పీ8ఐ నిఘా విమానంతో గస్తీ కాస్తున్నట్లు తెలిపింది. శనివారం అరేబియన్ సముద్రం గుండా ఇండియాకు వస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై గుజరాత్​కు 401 కి.మీ. దూరంలో డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత కొన్ని గంటలకు సౌదీ నుంచి ఇండియాకు వస్తున్న మరో నౌక ఎంవీ సాయిబాబాపై ఎర్ర సముద్రంలోనూ యెమెన్​కు చెందిన హౌతీ రెబెల్స్ డ్రోన్ అటాక్ చేశారు. ప్లూటో లైబీరియాకు, సాయిబాబా గాబన్ దేశానికి చెందినవి కాగా, ఈ రెండు షిప్పుల్లోనూ స్టాఫ్​గా ఇండియన్లే ఉండగా, వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.