రాజును క్షేమంగా బయటకు తీసిన పోలీసులు

రాజును క్షేమంగా బయటకు తీసిన పోలీసులు

కామారెడ్డి , వెలుగు: చుట్టూ చిమ్మ చీకటి.. బయటకు వచ్చే తొవ్వ లేదు.. ఎటు నుంచి ఏ విషపురుగు వచ్చి కుడుతుందో తెలియదు.. అయినా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 47 గంటలు గుట్టలోపల రాళ్ల నడుమ ఇరుక్కపోయిండు. అతడి గుండె ధైర్యానికి తోడు రెస్క్యూ ఆపరేషన్​ ఫలించి బయటకు వచ్చిండు. కామారెడ్డి జిల్లా రెడ్డిపేటలోని గుట్ట రాళ్లలో మంగళవారం మధ్యాహ్నం చిక్కుకుపోయిన రాజును  గురువారం మధ్యాహ్నం పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది, స్థానికులు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. 

అసలు ఏం జరిగింది..?

రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు తన దోస్త్​ మహేశ్​తో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు షికారికి వెళ్లారు. రెడ్డిపేట- – సింగరాయిపల్లి రోడ్డు నుంచి  3 కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవి లోపల గుట్ట దిక్కు వెళ్తుండగా.. అక్కడ  రాజు సెల్​ఫోన్​  గుట్టలోపలి రాళ్ల మధ్యలో పడింది. దాన్ని  బయటకు తెచ్చేందుకు వెళ్లిన రాజు అందులోనే  చిక్కుకున్నాడు.   రాజు చేయి  రాళ్ల మధ్యలో  ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు. ఎంతసేపు ప్రయత్నించినా బయటకు రాకపోవటంతో.. మహేశ్​ ఊర్లోకి వెళ్లి మిగతా దోస్తులకు చెప్పాడు. నలుగురైదుగురు స్థానికులు గుట్ట రాళ్ల వద్దకు వెళ్లి.. రాజును బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. తమ వెంట నీళ్లు తీసుకెళ్లి ఇచ్చారు. ఆరోజు రాత్రి వరకు ప్రయత్నించినా  ఫలితం లేకుండాపోయింది. దీంతో  మహేశ్​తోపాటు అశోక్​ అనే వ్యక్తి  అప్పుడప్పుడు లోపల ఉన్న రాజుతో మాట్లాడుతూ రాత్రంతా అక్కడే గడిపారు. బుధవారం పొద్దున స్థానికులు అక్కడికి చేరుకొని రాజును బయటికి తెచ్చేందుకు ప్రయత్నించారు. రెండు రోజుల కింద ఓ పెండ్లికి వెళ్లి రాజు భార్య లక్ష్మి, బిడ్డ దివ్య, కొడుకులు ప్రేమ్​కుమార్, పవన్​కుమార్​.. రాజుకు ఫోన్​ చేయగా, ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి చేరుకున్నారు. ఈలోపు రాజు గుట్టరాళ్లలో ఇరుక్కుపోయిన  విషయం తెలియడంతో.. ఆమె మరి కొందరు బంధువులతో కలిసి అక్కడికి చేరుకుంది. ఎంత ప్రయత్నించినా రాజు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పోలీస్​, రెవెన్యూ ఆఫీసర్లకు స్థానికులు సమాచారం ఇచ్చారు. గుట్టరాళ్ల వద్దకు రామారెడ్డి పోలీసులు చేరుకొని పరిశీలించారు.  వెంటనే వారు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్  జితేష్​ వి పాటిల్, ఎస్పీ బి. శ్రీనివాస్​రెడ్డి అక్కడికి పోలీసు టీమ్స్ పంపారు. 

గంటల తరబడి రెస్య్కూ ఆపరేషన్​

గుట్ట రాళ్లలో ఇరుక్కున్న రాజును బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీమ్​ బుధవారం సాయంత్రం  4.30- గంటల మధ్య ఆపరేషన్​ ప్రారంభించింది. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగింది. అడిషనల్​ ఎస్పీ అన్యోన్య,  డీఎస్పీ సోమనాథం, కామారెడ్డి రూరల్,  భిక్కనూరు సీఐలు శ్రీనివాస్​, తిరుపతయ్య,  డివిజన్​లోని  పలువురు ఎస్సైలు అక్కడికి చేరుకున్నారు. వీరికి తోడుగా రెవెన్యూ,  ఫారెస్ట్​, ఫైర్,  హెల్త్, స్థానిక పంచాయతీ సిబ్బంది రెస్య్కూ ఆపరేషన్​లో భాగస్వాములు అయ్యారు. మొదట జేసీబీతో గుట్ట రాళ్లను తొలగించే ప్రయత్నం చేయగా ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత  పెద్ద జేసీబీని తెచ్చారు. గుట్ట రాళ్లు పెద్దగా ఉండటంతో  ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాళ్లను పగుల గొట్టే వ్యక్తులను,  మిషన్లను తెప్పించారు. వారితో పలుమార్లు  బ్లాస్టింగ్​ చేయిస్తూ రాళ్లను జేసీబీతో తొలగిస్తూ  ముందుకు వెళ్లారు. ఆయా శాఖల ఆఫీసర్లు, సిబ్బంది బుధవారం రాత్రంతా అక్కడే ఉన్నారు. మరోసారి గురువారం పొద్దున నుంచి మధ్యాహ్నం  2 గంటల వరకు రాళ్లు పేల్చి వాటిని తొలగించారు. గుట్టరాళ్ల సందులు తెలిసిన అశోక్​ అనే వ్యక్తి ఆఫీసర్లకు తోడుగా నిలిచారు. ఇతను పలుమార్లు రాళ్ల మధ్యలోకి వెళ్లి రాజుతో మాట్లాడి.. నీళ్లు,  జ్యూస్​లు అందించి వచ్చాడు. ఓ సారి రాజు కొడుకు ప్రేమ్​కుమార్​ను కూడా లోపలికి పంపి తండ్రితో మాట్లాడించారు.  రెస్య్యూ ఆపరరేషన్​ ఫలించి గురువారం మధ్యాహ్నం 2 గంటల టైమ్​లో రాజు బయటకు వచ్చాడు. దాదాపు  21  గంటల పాటు రెస్క్యూ టీమ్ ఆపరేషన్​ కొనసాగింది. క్షేమంగా రాజు బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాడు. రాజును వెంటనే  అంబులెన్స్​లో కామారెడ్డి జిల్లా హాస్పిటల్​కు తరలించారు.  చేతితోపాటు శరీరంపై అక్కడక్కడ గాయాలయ్యాయి. అందరి సహకారంతోనే  రెస్క్యూ ఆపరేషన్​సక్సెస్​ అయిందని ఎస్పీ బి. శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. 

నీళ్లు, జ్యూస్​, ప్లూయిడ్స్​ పంపిస్తూ..!

రాళ్ల మధ్య ఇరుక్కున్న రాజు ఆరోగ్యంగా ఉండేందుకు స్థానికులు, ఆఫీసర్లు పలుమార్లు నీళ్లు,  జ్యూస్​, ప్లూయిడ్స్​ పంపించారు. మధ్య  మధ్యలో అతనితో మాట్లాడుతూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. డాక్టర్లు కూడా ఎప్పటికప్పడు రాళ్ల సందుల్లో  నుంచి అతడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆక్సిజన్​ సిలిండర్లు, ఇతర సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచారు.  డిప్యూటీ డీఎంహెచ్​వో శోభ, డాక్టర్లు  రాళ్ల మధ్యలో ఉన్న రాజును పరిక్షించారు. 

రాత్రంతా మాట్లాడుతూ ఉన్నం ​

రాజుతో పాటు నేను షికారుకు వచ్చినం. రాళ్లపైకి  ఎక్కి చూస్తుంటే.. రాజు ఫోన్​పడిపోయింది. దాన్ని తేనీకి రాజు లోపలికి పోయి ఇరుక్కపోయిండు. లోపల ఉన్న రాజుతో మంగళవారం రాత్రంతా మాట్లాడుతూ అశోక్​తో కలిసి ఆడ్నే ఉన్న. బయటకు ఎట్ల వస్తడోనని భయమైంది.   
- మహేశ్, గ్రామస్తుడు 

ధైర్యమే కాపాడింది

రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు ధైర్యంగా ఉన్నా. అస్సలు భయపడ లేదు. అందుకే క్షేమంగా బయటపడ్డా. నా ధైర్యమే నన్ను కాపాడింది. బయటకు తెచ్చేందుకు ఆఫీసర్లు, ఊరోళ్లు, చాలా మంది చేసిన మేలు ఎప్పటికీ నేను మరువలేను. రాళ్లు పగులగొడుతున్నప్పడు భయం కాలేదు. పక్కన ఉన్నోళ్లు ధైర్యం చెప్పిన్రు. - రాజు